calender_icon.png 18 August, 2025 | 5:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చందమామను దాటేద్దాం!

06-01-2025 12:00:00 AM

‘బాల సాహిత్యం’ అనగానే ‘బాల సాహిత్యం అంటే ఏమిటి? ప్రస్తుత పరిస్థితి ఎలా వుంది? పిల్లల కోసం పెద్దలు రాసేదా లేక పిల్లలే రాసేదా?’ ఇటువంటి సందేహాలు చాలామందిని వెంటాడుతుంటాయి. ఇక్కడ అత్యంత స్పష్టమైన విషయం ఏమిటంటే, ‘బాలలు ఇష్టపడేది, వారికి కావలసింది ఏమిటో అదే సరైన బాల సాహిత్యం’. కానీ, ఇటీవలి కాలంలో ఈ అంశాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు తోచింది, తెలిసింది బాల సాహిత్యం పేరుమీద రాసేస్తున్నారు. అంతటితో ఆగకుండా పుస్తకాలుగానూ వేసుకుంటున్నారు. దీనివల్ల రాశి పెరుగుతున్నదే కానీ, వాసి పెరగడం లేదు. ఇది విచారకరం. 

ప్రధాన స్రవంతి పత్రికల ప్రోత్సాహం

‘ఈతరం బాలలు ఎలా వున్నారు? వారికి ఏం కావాలి?’ అన్నది అందరం ఆలోచించవలసిన విషయం. మనకు నచ్చింది ఏదైనా సరే పుంఖానుపుంఖాలుగా రాసేసి పుస్తకాలు ప్రచురించడం వల్ల అసలు ప్రయోజనం నెరవేరదు. సుమారు ఏడు దశాబ్దాల క్రితం పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పటి కాలానికి అనుగుణంగా వచ్చిన ‘చందమామ’, ‘బాలమిత్ర’, ‘బొమ్మరిల్లు’ వంటి పిల్లల పత్రికలు చదివిన వారు, ఇప్పటికీ అలాంటి ప్రయోజనాత్మక కథలనే రాస్తున్నారు.

కానీ, తర్వాత వచ్చిన తరం వారికి పిల్లల కోసం ఏం రాయాలో తెలియడం లేదు. బాలలకు ముఖ్యంగా పదో తరగతి లోపు వారికి కావాల్సిందేమిటో వారు కనీసం ఆలోచించడమైనా లేదు. అయితే, అప్పటి చందమామలు, బాలమిత్రలు, బొమ్మరిల్లులు ఇప్పుడు లేకపోవడమేకాక పిల్లలకోసం ప్రధానంగా అటువంటి కథల పత్రికలు రావడం లేదు.

1980వ దశకంలో ‘ఉదయం’ దినపత్రికలో ‘ఉదయ బాల’, 1990వ దశకంలో ‘వార్త’ దినపత్రికలో ‘మొగ్గ’ పేర్లతో పిల్లల కోసం ప్రత్యేక పేజీలు వెలువడడంతో ప్రధాన స్రవంతి పత్రికలు బాల సాహిత్యాన్ని ప్రోత్సహించే పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది. అప్పట్నుంచీ ఇంచుమించు ప్రతీ దినప్రతిక, ఇప్పటి ఆన్‌లైన్ పత్రికలు సైతం పిల్లల సాహిత్యాన్ని ఎంతో కొంత ప్రతీ రోజు కాకున్నా వారానికి ఒకసారైనా ఇస్తూ వస్తున్నాయి.

అయితే, ఇదంతా పిల్లలను ఆహ్లాదపరుస్తూ, వారికి కొంతలో కొంత విజ్ఞానదాయకంగా ఉపయోగపడే సాహిత్యమే. కాకపోతే, ఒకప్పటి కథా సాహిత్యం నేటి పిల్లలకు ఇప్పటికీ అందడం లేదు. ఈ పర్థితుల్లో కూడా తెలంగాణ నుంచి ‘బాల చెలిమి’, ‘మొలక’, ఆంధ్రప్రదేశ్ నుంచి ‘బాలబాట’  మాసపత్రికలు  క్రమం తప్పకుండా వస్తున్నాయి. గత ఐదేళ్లుగా ‘మొలక’ ఆన్లైన్‌లోనూ వస్తున్నది. 

‘చందమామ’ కథలను మించి ఆలోచిద్దాం

నాలుగు దశాబ్దాల కిందట పలు దినపత్రికల్లో కూడా బాల సాహిత్యానికి అంతగా చోటు ఉండేది కాదు. ఈ నేపథ్యంలోనే ఉదయం, వార్త పత్రికల్లో రోజువారీ బాలల పేజీలు ఈ రచయిత ఆధ్వర్యంలోనే ప్రారంభమైనాయి. ఆ తరువాత మిగతా పత్రికలు కూడా బాల సాహిత్య శీర్షికలు ప్రారంభించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి బాల సాహిత్యం ఒక రకమైన కొత్త మలుపు తిరిగిందనే చెప్పాలి.

ఇంతేకాక, కేంద్ర సాహిత్య అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం బాల సాహితీ వేత్తలకు అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ విప్లవాత్మక మార్పు ప్రజలలో బాల సాహిత్యంపై వ్యామోహం పెరిగేలా చేసింది. గత కొన్నేళ్లుగా అసలే ఆంగ్ల మాధ్యమం వచ్చి తెలుగు భాషకు పిల్లలు దూరమవుతున్న తరుణంలోనే వారికి కథలు, పాటలు, గేయాల రూపంలో నీతిని, మానవీయ విలువలను, శాస్త్రీయాంశాలను బోధించేవారే కరువయ్యారు. వీటి తాలూకు బాల సాహిత్యాన్నిచ్చే పత్రికలూ లేవు. దీంతో ఇప్పటి అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలపైన ఇది పెద్ద బాధ్యతగా కనిపిస్తున్నది. ఈతరం రచయితలు మన ‘చందమామ’ కథలను మించి ఆలోచించగలగాలి.

కాలంతోపాటు రచయితలూ మారాలి

ఈ సమయంలోనే సంతోషించాల్సిన విషయం ఒకటుంది. గత కొన్నేళ్లుగా అనేకమంది బాలలు కూడా కథలు, గేయాలు, పద్యాలు రాస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఇది ఆహ్వానించతగిన పరిణామం. అయితే, ఇటువంటి సాహితీ సృజన చేసే బాలల ఆలోచనలకు మరింత పదును పెట్టే పరిస్థితులు స్కూళ్లు, ఇండ్లలోనూ ఉండాలి. వారికి రచనా విధానంలో కావలసిన సూచనలు పెద్దలు, తల్లిదండ్రులే అందించాలి.

ఇక, పిల్లల కోసం సాహిత్యాన్ని సృష్టించే యువకులు, పెద్దలు తమకు నచ్చిన విషయాలు కాకుండా వారికేం కావాలో ఇవ్వగలగాలి. ఆర్.కే. నారాయణ్ ‘మాల్గుడి డేస్’, మార్క్ ట్విన్ ‘టాం సాయర్’, జేకే రోలింగ్ ‘హార్రీ పాటర్’ స్థాయి రచనలు తెలుగులో ఎందుకు రావడం లేదో ఒక్కసారి అందరం ఆలోచించుకోవాలి. ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ఎంత పెరిగినా అక్షర రూప సాహిత్యానికి ఉండే విలువను మనం మర్చిపోకూడదు. 

ఈతరం పిల్లలను ఆకట్టుకొనేలా అద్భుతమైన బాల సాహిత్యాన్ని సృష్టించే రచయితలు మనకు లేక కాదు. ఈ మేరకు ప్రచురణకర్తలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, గ్రంథాలయాధికారులు కూడా ముందుకు వచ్చి, ప్రోత్సహించవలసి ఉంటుంది. అప్పుడే తెలుగులో బాల సాహిత్యం కూడా ప్రపంచ స్థాయి రికార్డులను సృష్టించగలదు. నిరంతర అధ్యయనం అన్నది బాల సాహితీవేత్తలకు అవసరం.

వారు కాలంతోపాటు మారుతుండాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘బాలల అకాడెమీ’ ఉండేది. అంతకంటే ముందు పాతరోజుల్లో ‘ఆకాశవాణి’లో పిల్లల కార్యక్రమాలు వచ్చేవి. ఇప్పుడు కొన్ని టీవీ సంస్థలు సినిమా పాటలు, డ్యాన్స్‌లకు ఇస్తున్నంత ప్రాధాన్యం బాలసాహిత్యానికి ఇవ్వడం లేదు. చిన్నారులలో సాహిత్య సంబంధ సృజన, రచనా వ్యాసంగాలను పెంపొందించడం పట్ల ప్రస్తుత మీడియా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది.

రేపటి పౌరులకు కావాల్సింది ఇద్దాం!

బాలసాహిత్యంలో కృషి చేస్తున్న రచయితలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో మరింత విస్తృత స్థాయి గుర్తింపు అందాలి. ప్రభుత్వ అవార్డులు ప్రాంతీయ భేదాలు లేకుండా అందించాలి. తెలంగాణలో ఇతర సాహిత్య ప్రక్రియల రచయితలు, కవులతోపాటు బాల సాహితీవేత్తలు సైతం వివక్షను ఎదుర్కొంటుండడం బాధాకరం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఇచ్చే అవార్డులలో కూడా ఒత్తిళ్లు తావివ్వకూడదు.

పాఠశాలల్లోని గ్రంథాలయాలకు కొనుగోలు చేసే పుస్తకాలు నేరుగా బాల సాహితీవేత్తల నుంచి తీసుకొనే ప్రక్రియను ప్రభుత్వం ప్రవేశపెట్టాలి. పుస్తక ప్రచురణల కోసం బాల రచయితలకు ప్రభుత్వం తన వంతుగా సహకరించాలి. తెలంగాణ సారస్వత పరిషత్ బాలలకు కార్యశాలలు నిర్వహించి పుస్తక ప్రచురణకు ప్రోత్సహిస్తున్నారు. అదే విధంగా, బాల చెలిమి కూడా అన్ని జిల్లాలకు చెందిన బాలల పుస్తకాలు ప్రచురించారు.

డా. వి.ఆర్.శర్మ, గరిపల్లి అశోక్ సైన్స్ నవలల పోటీలు నిర్వహిస్తున్నారు. తానా, మంచి పుస్తకం వారు ప్రతి ఏటా కథలపోటీ ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా మంచి పరిణామం. ఇలాంటివి ఇంకా విస్తృతం కావాలి. మనం పిల్లలకు ఎంత ఇస్తే వారు మనకు అంత ఫలితాన్ని చూపిస్తారు.

గతంతో పోలిస్తే సాహితీవేత్తల సంఖ్య పెరిగింది. అయితే, వారు అవార్డులు, ఇతర గుర్తింపుల కోసం కాకుండా నిజాయితీగా కృషి చేయవలసిన అవసరం వుంది. రేపటి తరానికి మార్గదర్శకులుగా మారి బాల సాహిత్యాన్ని పరిపుష్టం చేయవలసిన బాధ్యత వారిపై వుంది. అవార్డులతో  గుర్తింపు పొందిన వారు బాల సాహిత్యానికి దూరం కావడంతోపాటు మునుపటిలా చొరవ తీసుకోక పోవడం  విచారకరం.

అద్భుత సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ తరుణంలో పిల్లల ఆలోచనా సరళిలో కూడా అనూహ్య మార్పు వచ్చింది. వారికి అనుగుణంగా సాహిత్యంలోనూ మార్పు రావాలి. బాల సాహిత్యాన్ని కేవలం కథలు, కవితలకు మాత్రమే పరిమితం కళలు, క్రీడా, వైజ్ఞానికం వంటి విషయాలకూ విస్తరించాలి. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకే, ఏ ప్రభుత్వమైనా బాలల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. తెలుగు బాల సాహిత్యం రానున్న కాలంలో ప్రపంచ భాషలతో పోటీ పడే స్థాయికి ఎదగాలిన పిల్లల ప్రేమికులుగా మనమంతా కోరుకుందాం. 

(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, బాల సాహితీవేత్త)