calender_icon.png 18 August, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత్వం చెప్పిన మహామంత్రి శివదేవయ్య

06-01-2025 12:00:00 AM

  • ‘అతడు ప్రతాపరుద్ర వసుధాధిపు చేత నవాగ్రహారముల్

హితమతినంది నిత్యసచివేశ్వర సంతతి కెల్లమేటియై

యతులిత సంస్కృతాంధ్ర కవితావళి కెల్ల బితామహుడనన్

సతతము వన్నెకెక్కి బుధ సంఘములోన మహా ప్రసిద్ధుడై”

అన్న ఈ పద్యాన్ని రచించింది తుళ్లూరి శరభరాజ కవి. తన కావ్యం ‘శరభ రాజీయం’లో రచించిన ఈ పద్యాన్నిబట్టి, దీనికన్నా ముందు చెప్పిన సీసపద్యాన్నిబట్టి ‘శివదేవయ్య’ కేవలం మహామంత్రి మాత్రమేగాక ఆయన ‘సంస్కృతాంధ్ర కవితావళి కెల్ల’ పితామహుని వంటివాడని తెలుస్తున్నది.

ఈ విషయాన్ని సుప్రసిద్ధ సాహితీవేత్త కీ.శే. నిడుదవోలు వెంకటరావు అప్పటి ‘భారతి’ పత్రికలో ప్రచురించారు. తాము రాసిన వ్యాసంలో ‘ప్రథమాం ధ్ర కవితా పితామహుడు’ ఈ శివదేవయ్యే అని ఆయన పేర్కొన్నారు. ఇదంతా శరభరాజ కవి చెప్పిన మాటలవల్ల వెలువడ్డ అభిప్రాయమే. ఈ శరభరాజ కవియే శివదేవయ్య ప్రతిభను వివరించే సీసపద్యా న్ని రచించాడు.

  • “శ్రీమదష్టాంగ ప్రసిద్ధ యోగాభ్యాసి
  • ధరనోరు గంటి సత్పుర నివాసి
  • ప్రాణలింగార్చిత భావ సంచయమౌళి
  • యజ్ఞాన తిమిర సంహార హేళి
  • బోధ సన్మిత్రంబు పోష్యదయాశాలి
  • శోభితాశాంతా యశోవిశాలి
  • అమల శ్రీవత్ససంయమి గోత్ర పావని
  • వర్ణిత సకల విద్వన్నిధాని
  • సంతతోల్లాసి దిననాథ సమవిభాసి
  • రహిత దుష్కర్మి నిత్య సన్మహిత ధర్మి
  • యనగ నుతికెక్కి శివదేవుడనెడు యోగి
  • నాయకుండు సదామోక్షదాయకుండు”

అని శివదేవయ్యను ఒక యోగిగా కూడా పేర్కొన్నాడు. దీనిని గమనిస్తే ఆయన కేవలం మంత్రాంగం నెరపే మంత్రి మాత్రమే కాదు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన యోగిగా, నిత్య సత్కర్మలు చేసే మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహనీయునిగా కూడా అర్థం చేసుకోవచ్చు.

శివదేవయ్య కాకతీయ రాజ్యపాలకులైన గణపతిదేవ చక్రవర్తి, రుద్రమదేవి, ప్రతాపరుద్రుల కొలువుల్లో మంత్రిగా అత్య ంత సామర్థ్యంతో అమాత్య పదవి నిర్వహించిన ప్రతిభావంతుడు. కాకతీయ రాజుల ప్రజా పరిపాలనలో అనేక సత్కార్య నిర్వహణల్లో, రాజ్య విస్తరణలో, శత్రురాజులను జయించే యుద్ధ వ్యూహాలలో రాజులకు అండగా నిలిచి సహకరించిన సమర్థుడైన మం త్రి.

చరిత్ర పుటల్లో తనకంటూ ఒక ప్రత్యేక పుటను ఏర్పరచుకున్న యోగ్యత కలిగిన మహనీయుడు. ఇంతటి ప్రతిభావంతుడైన శివదేవ య్య సాహిత్య రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నాడనడానికి ప్రత్యేకంగా ఆయన రచించిన రచనలేవీ అందుబాటులో లేవు. కాని, లక్ష ణ శాస్త్రకారులు తమ తమ లక్షణశాస్త్ర గ్రంథాలలో శివదేవయ్య రచనలుగా ఉదాహరించిన పద్యాలు మాత్రం అందుబాటులో ఉన్నాయి. వీటి ఆధారంగా సాహిత్య చరిత్రకారులు ఆయన సాహిత్య ప్రతిభను గుర్తించారు.

ఆ ప్రస్తావనలే ప్రబల ఆధారాలు

తెలుగులో లక్షణశాస్త్రాలు, తమతమ లక్షణగ్రంథాలలో ఉపయోగించుకున్న పలువురు కవుల పద్యాలనుబట్టి ఎన్నో కావ్యాల వివరాలు, కవుల రచనలలోని విశేషాలు తెలుస్తున్నాయి. మడికి సింగన ‘సకలనీతి సమ్మతము’లో ఉదాహరించిన ‘పురుషార్థ సారము’ అనే గ్రంథంలోని పద్యాలనుబట్టి శివదేవయ్యను రచయితగా గుర్తించవచ్చునని తొట్టతొలుత తెలిపిన మహాపరిశోధకులు కీ.శే. మానవల్లి రామకృష్ణ కవి.

ఆయన ఈ ‘సకలనీతి సమ్మతాన్ని’ పరిష్కరించి రచించిన పీఠికలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. లింగమగుంట తిమ్మకవి ‘బాలబోధ చ్ఛందము’లోను, పొత్తపి వెంకటరమణ కవి రచించిన ‘లక్షణ శిరోమణి’లోను శివదేవయ్య రచనల నుంచి లక్ష్యాలను ఎన్నుకొన్నారని మానవల్లి వారు పేర్కొన్నారు. దీనివల్ల కూడా ఆయన రచనల పరిచయం కలుగుతుంది.

ఈ రెండు రచనలు క్రీ.శ. 1500ల ప్రాంతానికి సంబంధించినవి కనుక ఈ శివదేవయ్యను కాకతీయుల మంత్రి శివదేవయ్యగా చరిత్రకారులు అభిప్రాయపడ్డా రు. పొత్తపి వెంకటరమణ కవి కాలానికి శివదేవయ్య రచనలు లభించుచుండి ఉండవచ్చునని సాహిత్య చరిత్రకారులు భావించారు. అంతేగాక, 1678 మధ్య కాలంలోని వాడైన ఎడపాటి పెద్దన కవి తన ‘మల్హణ చరిత్ర’లో 

“వినుతులొనర్తు నంధ్ర కవి ప్రభు నన్నయభట్టు  తిక్క

యజ్వను, శివదేవు, భాస్కరుని..” అంటూ స్తుతించాడు. అదే విధంగా తురగా రాజకవి, అయ్యంకి బాలసరస్వతి అనే జంటకవులు తమ ‘నాగర ఖండం’లో 

“శివతత్తు శివదేవు, చిన్మయు భవదూరు

శరభాంకు, రాజశేఖరుని..” అంటూ స్తుతించారు.  దీనినిబట్టి వారి కాలం అంటే 1660 వరకు కూడా శివదేవయ్య రచనలు అందుబాటులో ఉండవచ్చునన్నది పండితుల భావన. 1760 తరువాత వెలువడ్డ పింగళి ఎల్లనార్యుని ‘తోభ్య చరిత్ర’ కూడా శివదేవయ్యను కీర్తించింది. 1347 ప్రాంతం వాడైన మడికి సింగన కాలం నుంచి 1760 ప్రాంతం వాడైన పింగళి ఎల్లనార్యుని కాలం వరకు శివదేవయ్య రచనలు అందుబాటులోనే ఉండవచ్చునని ఆరుద్ర అభిప్రాయపడ్డారు.

అటు సంస్కరణలు, ఇటు కవిత్వం

మానవల్లి వారి సంపాదకత్వంలో వెలువడ్డ మూడాశ్వాసాల మడికి సింగన రచన ‘సకలనీతి సమ్మతం’లోని 992 గద్య పద్యాల్లో 90 పద్యాలు ‘పురుషార్థ సారం’ లోనివే కావడం విశేషం. ‘సకలనీతి సమ్మతం’లోని కవి పలు విషయాలను ప్రస్తావిస్తూ, ఎందరో మహాకవుల రచనల నుంచి పద్యాలను ఉదాహరించాడు. అదే విధంగా ప్రజాపాలన, రాజు ఆదాయ వ్యయ ప్రకారం, రాజనీతి, దండయాత్ర, బ్రాహ్మణాచారం, శకున జ్ఞానం, ప్రయాణ వ్యసన పరీక్ష, చోరనీతులు, దుర్గ సంరక్షణ వంటి 19 ప్రత్యేక శీర్షికలలో ఎక్కువగా ‘పురుషార్థ సారం’లోని పద్యాలనే సింగన ఉపయోగించుకున్నాడు.

ప్రతాపరుద్ర చక్రవర్తి కాలంలో శివదేవయ్య ద్వారా అనేక సంస్కరణలు జరిగాయని, ఆ విధంగానే రాజు 77 నాయంకరుల విధానాన్ని ప్రవేశపెట్టాడని చరిత్ర చెబుతున్నది. ఇందులో ఇటువంటి రాజ్య సంబంధి విశేషాలు, పాలనాధికారాల్లో పాటించాల్సిన విధి విధానాలెన్నో ఉన్నాయి. అవి శివదేవయ్యకు తెలిసినవే కావడం ఈ రచన ఆయనే చేశాడన్న దానికి ప్రమాణం.

ప్రజారక్షణ రాజు బాధ్యత రాజ్యపాలనలో పాలకులు తీసుకోవలసిన శ్రద్ధను గురించి ముఖ్యంగా ప్రజారక్షణ విషయంలో రాజుకు ఉండవలసిన నిబద్ధతను గురించి చెబుతూ

  • “వెలుగుబెట్టి చేను గలయంగ బండిన
  • నురిపి ఫలముగొన్న తెరగుదోప
  • నాజ్ఞవెట్టి ప్రజల నరియప్పనంబులు
  • గొనగవలయు రాజకుంజరుండు”

అన్న పద్యంలో పాలకుడైన రాజు ప్రజలను ఆజ్ఞా పాలనం అనే కంచె వేసి కాపాడి, వారినుంచి ఫలం పొందాలని చెప్పడానికి మంచి పోలికను, మనందరికీ తెలిసిన, అనుభవంలో ఉన్న విషయంతో చెప్పడం ఈయన విశిష్టత. పొలానికి కంచె వేసి దాని ఫలసాయాన్ని కాపాడుకున్నట్టు రాజు ప్రజారక్షణ విషయంలో ప్రవర్తించాలని చెప్పడం ‘పురుషార్థ సార’ కృత్తికర్త నిబద్ధతను తెలియజేస్తుంది. ఏ రాజైనా ముందు శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవాలి. అప్పుడే తన ప్రజలను కాపాడే శక్తి కలిగిన వాడవుతాడు. తనను తానే రక్షించుకోలేని వాడు తన ప్రజలను ఎలా రక్షించగలడు? 

శివదేవయ్య మంత్రిగా ముగ్గురు కాకతీయ దిగ్గజ పాలకులకు మంత్రిత్వం చేసిన వాడు కనుక ఇటువంటివి చెప్పగలిగాడని పండితుల భావన. అయితే, తన ‘సకలనీతి సమ్మతం’లో ఏకంగా 90 పద్యాలను గ్రహించిన సింగన ఏ పద్యం కిందా శివదేవయ్య పేరు ఉటంకించలేదు. కేవలం గ్రంథనామాన్నే చెప్పాడు. “బహుశా అతని కాలం నాటికి అది చాలా ప్రసిద్ధమై ఉంటుంది. పేరు చెప్పవలసిన అవసరం లేదనుకున్నాడేమో” అన్న ఆరుద్ర అభిప్రాయం గమనించదగింది. ఇందులో కథ లేదు, ఇది కథా కావ్యం కాదు. ఇక్కడ రస చర్చకు తావు లేదు. ఇందులో లోకజ్ఞత, రాజనీతి, రుచిరార్థ సూక్తులు కనిపిస్తాయి. అందుకే, ఇదొక కవి నిర్మిత కావ్యం కాదని విజ్ఞుల భావన.

‘ధీమణీ’ శతక రచన “శివదేవ ధీమణీ” అనే మకుటం కలిగిన కొన్ని పద్యాలను మానవల్లి రామకృష్ణ కవి ఉదాహరించి ఈ శతకాన్ని శివదేవయ్య రచించి ఉంటాడని పేర్కొన్నారు. 

“అరయగ చిన్ననాడు సిరియాళుడనై, యెలబ్రాయమందు సుందరుడను నంబియై పదను దప్పిన గుండయగారి చందమై ధరజరియింపగల్గిన దథాస్తువృథా పరిపాక రూప దుష్కర జననం బిదేమిటికి గాలుపనే శివదేవ ధీమణీ” 

అన్న పద్యంలో శివదేవయ్య తనను తాను సంబోధించుకుని చెప్పకున్నాడు. ఈ పద్యంలో పేర్కొన్న పరమ శివభక్తులైన సిరియాళుడు, సుందరనంబి, గుండయ్య వంటి వీరశైవ సంప్రదాయానికి చెందిన వారి భక్తిని గురించి చెప్పిన కారణంగా ఇది వీరశైవ మత ప్రాచుర్యం కొనసాగుతున్న కాలంలో రచించిందిగా ఆరుద్ర భావించారు. తెలుగు సాహితీ ప్రపంచంలో తమదైన ముద్ర వేసుకున్న మహాకవుల మార్గంలోనే సాగి తనదైన రాజనీతి పరిణతిని, రాజ్యపాలనలో పాటించవలసిన రాజ్యధర్మాన్ని ఒక ప్రత్యేక రచనగా రూపొందించిన శివదేవయ్య నిజమైన ‘ధీమణి’యే.