07-01-2025 12:00:00 AM
చైనాలో కరోనా తరహా వైరస్ హెచ్‌ఎంపీవీ కలకలం సృష్టిస్తోందన్న వార్తలు వస్తున్న తరుణంలోనే భారత్‌లో సైతం ఈ వైరస్ వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. కర్నాటకలో రెండు, గుజరాత్‌లో ఒక కేసు నమోదయినట్లు దేశంలో భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సోమవారం ప్రకటించింది. కర్నాటకలో మూడు, ఎనిమిది నెలల వయసున్న ఇద్దరు చిన్నారులకు వైర స్ నిర్ధారణ కాగా అహ్మదాబాద్‌లో మరో రెండు నెలల బాలుడికి వైరస్ సోకినట్లు తేలింది.
చెన్నై, కోల్‌కతాలో కేసులు వెలుగు చూసినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ధ్రువీకరణ కాలేదు. బెంగళూరులో మూడునెలల చిన్నారి వైరస్‌నుంచి కోలుకుని ఆస్పత్రినుంచి డిశ్చార్జి కాగా, మరో చిన్నారి కూడా నేడో, రేపో ఆస్పత్రినుంచి డిశ్చార్జి కావచ్చని భావిస్తున్నారు. కాగా రాజస్థాన్‌కు చెందిన రెండు నెలల చిన్నారి అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా డాక్టర్లు హెచ్‌ఎంపీవీ పాజిటివ్‌గా నిర్ధారించారు.
డిసెంబర్ 26నే ఈ విషయాన్ని గుర్తించినా ఆలస్యంగా తెలియజేసి నట్లు అధికారులు తెలిపారు. అయితే వీరి కుటుంబాలు వైరస్ వెలుగు చూసిన దేశాల్లో ఎలాంటి ప్రయాణాలు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నారులకు సోకిన వైరస్ చైనానుంచి వచ్చిందా లేక ఇప్పటికే మన దేశంలోఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హెచ్‌ఎంపీవీ వైరస్ మన దేశంలో కూడా చాలా రో జులుగా ఉండి ఉండవచ్చని, కొందరికి ఈ వైరస్ సోకి కోలుకుని ఉండవచ్చని కూడా వైద్య అధికారులు అంటున్నారు. ముందుగా హెచ్చరించినట్లుగా అయిదేళ్ల లోపు వయసు పిల్లలకు ఈ వైరస్ సోకే అవకాశాలు ఎ క్కువ అని తాజాగా దేశంలో వెలుగు చూసిన కేసులను బట్టి అర్థమవుతోంది. భయపడాల్సిన పని లేదని, అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి.
ఈ వైరస్ కోవిడ్ తరహాలో వ్యాపించేది కాదని, అయినప్పటికీ రద్దీ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని కర్నాటక వైద్య విభాగం అడ్వైజరీ లో పేర్కొంది. మరోవైపు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అన్ని ముం దస్తు చర్యలు తీసుకోవాలని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
కానీ గత కోవిడ్ సమయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ప్రజలు మాత్రం కొత్త వైరస్ కేసులు పెరిగితే ప్రభుత్వాలు అప్పట్లాగా ఎక్కడ లాక్‌డౌన్‌ను అమలుచేస్తాయోనని భయపడుతున్నారు. అయితే 24 ఏళ్ల క్రిత మే వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు వ్యాపించి ఉంటుందని, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని అధి కారులు అంటున్నారు.
అంతేకాకుండా చైనాలో హెచ్‌ఎంపీవీ వైరస్ సహా వివిధ శ్వాసకోశ వ్యాధులు విజృంభిస్తున్నాయని వార్తలు రాగానే ప్రభు త్వం అప్రమత్తమైంది. ఇటీవలే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అధ్యక్షతన జాయింట్ మానిటరింగ్ గ్రూపు సమావేశం నిర్వహించింది కూడా. శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని నిర్ధారించింది.
భారత్‌లో అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ సీజన్‌లో శ్వాసకోశ వ్యాధులు పెద్దగా పెరగలేదని కూడా పేర్కొంది. ఒక వేళ కేసులు పెరిగి నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపింది. అయితే మలేసి యా, జపాన్.
హాం కాంగ్ లాంటి దేశాల్లో వందల సంఖ్య లో ఇన్‌ఫ్లూయెంజా కేసులు వెలుగు చూడడంతో పాటు, అక్కడి ప్రభుత్వాలు ముందు జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు అడ్వైజరీలు జారీ చేయడాన్ని బట్టి మన దేశంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థమవుతోంది. పండగల సీజన్‌తో పాటుగా మహా కుంభమేళాకు కోట్ల సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ‘చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు’గా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం ఎంతయినా అవసరం.