10-10-2025 12:16:08 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 9 (విజయక్రాంతి): వైద్య విద్యార్థుల్లో చాలామందికి ఒత్తిడి, కుంగుబాటు లాంటి మానసిక సమస్యలు ఉంటున్నాయని.. అయితే వాటిని అధిగమించడం ద్వారా జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలని పలువురు సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో ఆస్పత్రి సీఓఓ డాక్టర్ గాయత్రి కామినేని ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వంద మంది వైద్య విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులు ఆసక్తిగా పాల్గొన్నారు. డాక్టర్ గాయత్రి కామినేని మాట్లాడుతూ.. “డాక్టర్ అనగానే సమాజంలో ఒక మంచి గుర్తింపు, గౌరవం ఉంటాయి. అదే సమయంలో మంచి డాక్టర్ అనిపించుకోవాలనే ఒత్తిడి వైద్యుల మీద చాలా ఉంటుంది. కాబోయే వైద్యుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉండడం సహజం కాబట్టి, వాటిని తోటివారు గుర్తించి వారికి సహాయపడాలి” అన్నారు.
తల్లిదండ్రులు, తోటి స్నేహితులు గుర్తించగలగాలి అన్నారు. సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ గౌతమి నాగభైరవ మాట్లాడు తూ.. “పిల్లలు పదో తరగతి, ఇంటర్మీడియట్లలో చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నా నీట్ ర్యాంకు సంపాదించడం, ఎంబీబీఎస్ సీటు సాధించడం అంత సులభం కాదు. ఈ ఒత్తిడిని అధిగమించడమే కష్టం అవుతుంది. ఎంబీబీఎస్ పరీక్షల్లో మంచి మార్కులు రాకపోతే ఒత్తిడికి లోనవుతారు. ఇలాంటి సమయంలో స్నేహితులు, తల్లిదండ్రులు తోడుగా ఉండాలి” అన్నారు.
ఇన్నర్ కనెక్ట్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్ కంకిపాటి వరూధిని మాట్లాడుతూ.. “ప్రతి ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఒకరికి క్లినికల్ డిప్రెషన్, ఎమోషనల్ ఇమ్మెచ్యూరిటీ, ఓడిపోతామన్న భయం, సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం లాం టి సమస్యలు ఉంటున్నాయి. ఇళ్లలో అంద రూ కూర్చుని హాయిగా మాట్లాడుకోవాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పుడూ మాట్లాడుతూ, వారి అవసరాలేం టో, సమస్యలేంటో గుర్తించాలి” అన్నారు.