ఆటోను ఢీకొట్టిన లారీ ముగ్గురు దుర్మరణం
నల్లగొండ జిల్లాలో ఘటన
మునుగోడు (నాంపల్లి), మార్చి 15 (విజయక్రాంతి): ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం రేఖ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని వస్త్రంతండా సమీపంలో మల్లేపల్లి చింతపల్లి రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగింది. మల్లేపల్లి నుంచి చింతపల్లి వైపు 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుక నుంచి ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందారు.
మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో చింతపల్లి మండలం కొర్ర మాన్సింగ్ తండాకు చెందిన కొర్ర బద్య (57), బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ ఖలీఫా (40), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల కు చెందిన బండార్ విశాక్ (55) కు ముగ్గురు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కొంతమందిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




