16 July, 2026 | 12:38 PM

బతుకు ఆగమైంది సార్.. ఆదుకోండి!

04-07-2024 01:00 AM

మన తెలంగాణ సమాజానిది ఆత్మగౌరవ స్వభావం. కనీసం వెయ్యేండ్ల చరిత్రను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. ఇక్కడి ప్రజలు కష్టపడి పనిచేస్తారు. శ్రమనే నమ్ముకొని జీవిస్తారు. ఆకాశం వంక చూసి వర్షం కావాలని కోరుకుంటారు. భూదేవి వైపు చూసి పంటను ఇమ్మని ప్రార్థిస్తారు. కష్టపడి సంపదను సృష్టిస్తారు. ఎదుటి మనిషికి సాయం చేయడం, వారి విముక్తి కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి సిద్ధపడటం తెలంగాణ ప్రజలకు పుట్టుకతో వస్తుంది. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాలు ఏర్పడి మన బతుకులు బాగుపడతాయని, మన కొలువులు మనకే వస్తాయని ఎందరో నిరుద్యోగులు ఆశపడ్డారు.  యువ త ప్రాణ త్యాగాలకు కూడా వెనుకాడకుండా పోరాటం చేసి సాధించుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయి.. ఉద్యోగాలు దక్కుతాయనే అందరిలాగానే విద్యార్థి ఉద్యమకారుడు పరమేష్ బలంగా విశ్వసించాడు. ప్రత్యేక తెలంగాణ పోరుబాటలో ఉద్యోగం అడ్డంకిగా మారింద ని గుర్తించి.. తాను చేస్తున్న హోంగార్డు ఉద్యోగాన్ని సైతం వదులుకొన్నాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాకే తాను ఉద్యోగం చేస్తానంటూ ధీమాగా ప్రతిన బూనారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లుకు చెందిన విద్యార్థి నాయకుడు పరమేశ్ ఉద్యమ కారుడిగా గుర్తింపు పొందాడు. 

ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం ఎక్కడ మీటింగ్ జరిగినా పరుగు పరుగున వాలేటోడు.. తెలంగాణ ధూంధాం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ తన వెంట నలుగురిని తీసుకెళ్లేటోడు. ఆంధ్ర పాలకుల అణిచివేత గురించి తెలంగాణ మేధావి వర్గం చేస్తున్న ప్రసంగాలు, నేతల మాటలకు మంత్రముగ్ధుడై ఉద్యమానికి ఆకర్షితుడ య్యాడు. ఆంధ్ర పాలనలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో జరుగుతున్న అన్యాయాలపై పల్లె పల్లెల్లో గళం విప్పి ప్రజలను చైతన్య పరిచాడు. తెలంగాణ ప్రత్యేక ఉద్యమం కోసం సబ్బండ వర్ణాలను ఏకం చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.  ఉద్యమ సమయంలో రాష్ట్ర జేఏసీ ఇచ్చిన ప్రతి పిలుపులో ముందు వరుసలో ఉండేవాడు.

సకలజనుల సమ్మె, వంటావార్పు, మిలియన్ మార్చ్  ఇలా  చారిత్రాత్మక ఉద్యమాలలో పరమేశ్ పోషించిన పాత్ర ఆమో ఘం. ఆమనగల్లు బ్లాక్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన జేఏ సీలో కీలకపాత్ర పోషించాడు. నిరాహార దీక్ష శిబిరంలో నిరంతరం ఉద్యమ దివిటిలాగా వెలిగేటో డు.  తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసేందుకు చేస్తున్న కుట్రలపై మండి పడుతూ అన్ని వర్గాల ప్రజలను ఉద్యమానికి జై కొట్టేలా తన వంతు ప్రయత్నం చేశాడు. ఉద్యమ సమయంలో తనపైన కుట్ర పూరితంగా నమోదు అయిన పీడీ యా క్ట్ కేసులకు భయపడకుండా తెలంగాణ ఉద్యమ వీరుడిగా మహబుబ్‌నగర్ జైలుకు సైతం వెళ్లారు. అందరి చేత తెలంగాణ పరమేశ్‌గా కీర్తింపబడ్డాడు. కానీ బతుకు బాటలో ఉద్యోగం, ఉపాధి కరువై  నేడు దీనావస్థలో ఉన్నాడు. ఎంఏ, బీఎడ్ చేసి విద్యావంతుడైన ఉద్యమకారుడు పరమేశ్ ప్రస్తు తం జీవనం కొనసాగించేందుకు కుల వృత్తిని నమ్ముకొని భార్యాపిల్లలను పోషించుకుంటున్నాడు. 

కుల వృత్తే జీవనాధారం..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిన అనంతరం ఉద్యమకారులకు సముచిత స్థానం దక్కుతుందని పరమేశ్ ఎంతో భరోసా పెట్టుకొన్నాడు. తీరా పదేళ్ల పాలనలో పాలకుల నుంచి అతనికి  చీదరింపులు ఎదురయ్యాయి. తెలంగాణ  ఉద్యమం లో  జైళ్లకు వెళ్లిన.. ఏమైనా ఉపాధి, ఉద్యోగం అవకాశం కల్పించండి సార్ అంటూ నేతల గడపలు తొక్కుతూ వారి ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం కనిపించలేదు. నీవొక్కనివే ఉద్యమం చేశావా? అందరూ ఉద్యమం చేసిన్రులే అంటూ వెక్కిరింపులు, చీదరింపులు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను  కలిసి తన గోడును వేళ్ల బుచ్చుకొన్న ఫలి తం లేదు.

దీంతో కుంగుబాటుకు గురై తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకు లు మారుతాయి ఇంత ఉఫాధి, ఉద్యోగం దక్కుతుంది అనుకున్నా కానీ నా జీవితం ఇలా అవుతుందనుకోలే అంటూ  కళ్లలో బాధను దిగమింగుకొన్నాడు. భార్యాబిడ్డలను పోషించుకొ నేందుకు తప్పని పరిస్థితిలో తన కులవృత్తినే మళ్లీ నమ్ముకున్నాడు. పల్లెల్లో, పట్నాల్లో జరిగే జాతరలు, అంగడిలో ఆట వస్తువులు, కుంకుమ, తాళం చేవులు రిఫేర్ చేస్తూ  ప్రస్తుతం బతుకు బండిని నడిపిస్తున్నాడు.

సీఎం రేవంత్‌రెడ్డి పైనే ఆశలు..

తెలంగాణ ఉద్యమకారుడు పరమేశ్ దీనగాథ పై  రెండేళ్ల క్రితం పలు దినపత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో పీసీసీ హోదాలో ఉన్నప్పుడు  సీఎం రేవంత్‌రెడ్డి  స్పందించాడు. తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని తప్పనిసరిగా హైదరాబాద్‌కు వచ్చిన తరువాత కలుస్తానంటూ  పరమే శ్‌తో ఫోన్‌లో మాట్లాడి భరోసా కల్పించాడు. అంతలోనే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. సీఎం కావడంతో పరమేశ్‌కు ఆశలు  మళ్లీ చిగురించాయి. సీఎం రేవంత్‌రెడ్డిని ఒక్కసారి కలిస్తే తన సమస్య తీరుతుందని తనకు ఉద్యోగం, ఉపాధి చూపిస్తాడని సీఎం రేవంత్ రెడ్డిపై  ఎంతో నమ్మకంతో బతుకుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో పోగొట్టుకొన్న తన హోంగార్డు ఉద్యోగం సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇప్పిస్తే  బతుకుపై భరోసా కలుగుతుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎప్పటికైనా తనకు సీఎం సార్ నుంచి పిలుపు వస్తుందని మాత్రం పరమేశ్ ఎంతో ధీమాగా ఉన్నాడు.

ఈర్లపల్లి పాండు, రంగారెడ్డి