పిడికిలి బిగించి.. పోరాటాన్ని నడిపించాం!
తెలంగాణ నేలను ఆంధ్రాపాలకులు ఆక్రమించారని, ఇక్కడి నీళ్లు, నిధులు, సంపద, భూమిని ఆంధ్రా పెత్తందారులు స్వాధీనం చేసుకున్నారని, 60 ఏండ్లు తెలంగాణను ఆగం చేశారని, భాషను ఎక్కిరించారని, బతుకు మీద చితిపేర్చారని, పదవులు ఆంధ్రా వాళ్లే అనుభవించారని, తెలంగాణ ప్రజలను దిగువ స్థాయికి నెట్టివేశారని, ఉద్యోగాలు కొల్లగొట్టారని, చదువులను ఆగం చేశారని, తెలంగాణ భాషను హీనంగా చూశారని ఉద్యమం పుట్టుకొచ్చింది. అది ప్రత్యేక తెలంగాణ కోసం చేసిన తొలి, మలి దశ ఉద్యమం. ఆంద్రోళ్లు తెలంగాణ నుంచి వెళ్లిపోతే ఉద్యోగాలు వస్తాయని టెంపరరీగా చేసే వారికి పర్మినెంట్ అవుతుందని తొలిదశ ఉద్యమంలో పాల్గొన్నట్లు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు, ప్రముఖ కవి సిరిగాధ శంకర్ తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమ అనుభవాలను విజయక్రాంతితో పంచుకున్నారు.
1969లో ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా రోడ్డు మీద ప్రజలు దండోరా వేశారు. వందలాది మంది యువతీయువకులు తమ నెత్తురు ధారపోసి ఆంధ్రా పాలకులకు వణుకు పుట్టించారు. తిరిగి 1996లో మలిదశ తెలంగాణ ఉద్యమం పురుడుపోసుకున్నది. తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ జాక్, తెలంగాణ విద్యార్థి జాక్.. ఇలా అనేక సంస్థలు, వ్యక్తులు, శక్తులు, పార్టీలు చేసిన పోరాట ఫలితంగా, సుమారు 12 వందల మంది తెలంగాణ యువత బలిదానం వల్ల 2014, జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. దేశ చరిత్రలో తెలంగాణ శకం మొదలైంది. ఇది మన ఉజ్వల గతం.
ప్రజాసమితి పేరుతో..
ఆత్మ గౌరవం అనే నినాదంతో పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కనీసం ప్రజాస్వామిక హక్కులు కూడా అభివృద్ధి లేని స్థితి దాపురించింది. నిరుద్యోగులు వయసు మీదపడి, బతుకు భారమై జీవిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రానికి చెందిన సిరిగాధ బాలమ్మ నర్సయ్యలకు సెప్టెంబర్ 1947లో సిరిగాధ శంకర్ జన్మించారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తరువాత లక్ష్మీని వివాహమాడారు. ఆయన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనుభవాలను వివరించారు. 31 ఆగస్టు 1968లో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తిమ్మారెడ్డిపేట్‌లో మొదట తాత్కలిక టీచర్ ఉద్యోగం వచ్చింది.
అప్పటికి పెళ్లి కాలేదు. ఒంటరిగా అద్దె ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నప్పుడు 1969లో తెలంగాణ తొలి ఉద్యమం ప్రారంభమైంది. ఆంధ్రా గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ అప్పట్లో తెలంగాణ ప్రజా సమితి పేరుతో చెన్నారెడ్డి ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ కామారెడ్డి ప్రాంతంలోని ఎల్లారెడ్డి ఏరియాకు వచ్చి ఉపన్యాసం చేశాను. ఆంద్రోళ్లు తెలంగాణ నుంచి వెళ్లిపోతే తాత్కలికంగా పనిచేసే ఉద్యోగులు పర్మినెంట్ అవుతారని తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చాను. టెంపరరీగా పని చేస్తున్న ఉపాధ్యా యు లు, ఇతర శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచారు.
తొలిదశ ఉద్యమాన్ని అణిచివేశారు..
ఆంద్రోళ్లు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడమే కాకుండా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చేది. పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారు. రోజు ఎల్లారెడ్డి ప్రాంతంలో ఉన్న పాఠశాలలను, కళాశాలల వద్ద కు వెళ్లి పాఠశాలలు ప్రారంభం కాగానే బెల్లు కొట్టి విద్యార్థులను పంపించేవారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ లోంకపల్లి కిషన్‌రెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతంలో జరగుతున్న ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయనతో కలిసి పర్మినెంట్ కానీ ఉపాధ్యాయులందరం గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యం చేస్తూ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలం గాణ యువకులకు ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని చెప్పేవాళ్లం.
బస్సులను ధ్వసం చేస్తే ఎల్లా రెడ్డి పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. ఉద్యోగాలు చేస్తున్న తమ జీవితాలు ఖారబ్ కావద్దని మారు పేర్లు పోలీస్ స్టేషన్లలో రాయించుకొని బయటపడ్డం. ఉద్యమం ఉధృతంగా 1969 సంవ త్సరంలో సాగింది. 1971లో పార్లమెంట్ ఎన్నిక లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో జై తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజాసమితి పార్టీ చెన్నారెడ్డికి అనుకూలంగా తెలంగాణ ప్రజలు అధిక సీట్లతో గెలిపిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెన్నారెడ్డికి ముఖ్యమంత్రి ఆశ చూపి ఉద్యమాన్ని నీరు కార్చారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చాలా మంది యువకులు పోలీసు దెబ్బలు తినడమే కాకుండా పలువురిని అడ్రస్ లేకుండా చంపేశారు. అలా మొదటి దశ ఉద్యమాన్ని అణిచివేశారు. టెంపరరీగా పనిచేసే ఉద్యోగులను పర్మినెంట్ చేశారు. దీంతో మొదటి దశ ఉద్యమం నీరు గార్చారు.
కవులు, కళాకారులను పట్టించుకోలే!
ఆంధ్రోళ్ల పెత్తనం కొద్దీ రోజులు తగ్గిన చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవినుంచి వైదోలగిన తరువాత రాయలసీమ, ఆంధ్రకు చెందిన ముఖ్యమంత్రులు పరిపాలించడంతో తెలంగాణలో మరింత అణిచివేతకు గురికావడమే కాకుండా అభివృద్దిలో కూడా వెనుకబడి పోయింది. నిధులన్నీ ఆంధ్ర ప్రాంతానికి తరలిస్తూ ఉద్యోగాల్లో కూడా వారి పెత్తనమే పెరి గింది. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తో కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ వస్తేనే మన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు పోందవచ్చని జయశంకర్ సార్‌తో ఉద్యమం ప్రారంబించడంతో అప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను.
తెలంగాణ ఉద్యమంలో కవితలు రాసి ప్రజలను, యువతను చైతన్యవంతం చేశారు. ఎడవకు, వెళ్లిపోండి అనే కవిత రచనలతో చైతన్యవంతం చేశారు. కవులు, కళాకారు లు ఉద్యమానికి సహకరించాలని కేసీఆర్ పిలుపునివ్వడంతో ఫ్రొఫెసర్ కోదండరాం జేఏసీ కన్వీనర్‌గా ఉండటంతో ఉద్యోగులం తొలిదశ తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి కృషి చేశాం. కామారెడ్డిలో జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ కోసం ఇచ్చిన ఉద్యమ పిలుపులో పాల్గొని పనిచేశాం.
2005లో ప్రధానోపాధ్యాయునిగా పదవివీరమణ చేశాను. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ పిలుపునిచ్చిన కార్యాక్రమా లు, బస్సు రోకోలు, వంటవార్పు, రైలు రోకో లు, జేఏసీ నిరవధిక నిరసన దీక్షలు నిజాం సాగర్ చౌరస్తాలో పాల్గొన్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని భావించాను. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత తెలంగాణ ఉద్యమకారులను, కవులను, కళాకారులను పట్టించుకోలేదు. తన సీటును చూసుకున్నాడే తప్ప తెలంగాణ అభివృద్దిపై ఏ మాత్రం ధ్యాస చేయలేదు.
సిరిగాధ శంకర్ సార్ గురించి..
ఆంద్రోళ్లకే కాంట్రాక్ట్‌లు ఇచ్చి తెలంగాణ కాంట్రాక్టర్లను, ప్రజలను యువతను మోసం చేశారు. మలి దశ ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ నీళ్లు, నిధు లు, నియామకాలపై కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో తెలంగాణకు మరింత నష్టమే చేకూర్చారనేది అభిప్రాయం. ఇప్పటి వర కు పది పుస్తకాలను రచించారు. ఆయన కవిత సంపుటిలను రాశారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఉపాధ్యాయ రత్న, యూనిక్ వరల్డ్ రికార్డు, వండర్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో పురస్కారాలను అందుకున్నారు.
హైదారాబాద్‌లోని జీవీఆర్, ఆరా ధన సంస్థ ఆధ్వర్యంలో సాహితి బింద్ అవార్డును దక్కించుకున్నారు. ప్రస్తుతం కామారెడ్డి కాకతీయనగర్ కాలనీలో తన నా సహచరి తో కలిసి నివాసం ఉంటున్నారు. వారికి ఒక కూతురు. ఆమె వైద్యవృత్తిలో స్థిరపడింది. ఇప్పటికి ప్రజలలో తిరుగుతూ పుస్తకాలు రచిస్తూ, యువతకు, నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు కావాల్సిన మెటిరీయల్‌ను తన రిటైర్డ్‌మెంట్ డబ్బులతో పుస్తకాలు, గ్రంథాలయలకు కొనిచ్చి సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం 77 సంవత్సరాల వయస్సు కలిగి ఉన్న సిరిగాధ శంకర్ సార్ ప్రజలకు,పేదలకు తనకు తోచిన సహయాన్ని అందిస్తూ కాలం గడుపుతున్నారు.
మొసర్ల శ్రీనివాస్‌రెడ్డి,
కామారెడ్డి జిల్లా, విజయక్రాంతి






