16 July, 2026 | 12:48 PM

ఉద్యమమే శ్వాసగా!

04-07-2024 01:00 AM

ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట సాధన కోసం జరిగిన తొలి, మలిదశలో ఉద్యమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉద్యమ కెరటం ఉవెత్తున ఎగిసి పడింది. ఎన్నో  బలిదానాలు.. మరెన్నో ఆటుపోట్లు.. వీటన్నింటికీ ఎద్దురొడ్డి ప్రత్యేక రాష్ర్ట సాధనకు జరిగిన ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లా ఉద్యమకారుల పాత్ర ఎంతో ఉంది. రాష్ర్ట వ్యాప్తంగా జరుగుతున్న మలిదశ ఉద్యమంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధర్యంలో చేపట్టిన దీక్ష శిబిరం సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1,523 రోజుల పాటు ఆదిలాబాద్‌లో నిరిరామంగా దీక్షా శిబిరాన్ని కొనసాగించిన ఘన చరిత్ర జిల్లా తెలంగాణ వాదులది. 

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు, విశ్రాంత ఉద్యోగులు, న్యాయవాదు లు, డాక్టర్లు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు, యువకులు, వికలాంగులు, ఆయా కుల సంఘాలు, చుట్టుపక్కల గ్రామస్తులు ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నపిల్లల నుండి మొదలుకొని వృద్ధుల వరకు దీక్ష శిబిరం వేదికగా తమ వంతుగా పోరాటాలు చేశారు. ఎన్నో పోరాటాలు చేయడంతో పాటు అప్పటి కేంద్ర ప్రభుతం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిషన్‌కు పలుమార్లు వినతులను సైతం సమర్పించారు. ఆదిలాబాద్‌లో  సుదీర్ఘ కాలంగా కొనసాగుతు న్న దీక్ష శిబిరానికి ఉద్యమకారుడు కేసీఆర్‌తో పా టు జేఏసీ చైర్మన్ కోదండరాం, ఆయా పార్టీల రాష్ర్ట నాయకులు సైతం దీక్ష శిబిరాన్ని సందరించి ఉద్యమకారులను ప్రోత్సహించేవారు.  

రాష్ర్టం కోసం 27 బలిదానాలు..

ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 27 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ర్ట సాధన కోసం ఉవెత్తున ఉద్యమం సాగుతున్న సమయంలో తాము సైతం అంటూ ఉద్యమంలో పాల్గొన్న  యువకులు, ఉద్యమకారులు అప్పటి ప్రభుతం చేస్తున్న కుట్రలకు మనస్థాపం చెంది ప్రాణాలను సైతం అర్పించుకున్న ఘటనలు జిల్లాలో సాగుతున్న ఉద్యమా నికి మరింత ఊతమిచ్చాయి. 

1,523 రోజుల పాటు దీక్ష.. 

తెలంగాణ ప్రత్యేక రాష్ర్టం కోసం రాష్ర్టవ్యాప్తంగా సాగుతున్న ఉద్యమంలో ఆదిలాబాద్‌కు చెందిన పలువురు ఉద్యమకారులు తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉద్యమానికి కేంద్రబిందువైన దీక్ష శిబిరాన్ని కొనసాగించడంలో సుమారు 50 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులు, యువకులు, రాజకీయ నాయకులు, మహిళలు ప్రతినిత్యం శ్రమించారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షా శిబిరాన్ని ఉద్యమకారుడు కారింగుల దామోదర్ ఆధర్యంలో అల్లురి శ్రీదర్, గొల్లపెళ్లి నర్సిములు, తుడుం రాములు, బండ గంగన్న, లోకుల రమేష్, రతన్ రెడ్డి, ఆంజనేయులు, డాక్టర్ కాస్తాల సుధాకర్, ఆయా పార్టీల నాయకులు రామచంద్ర రెడ్డి, జోగు రామన్న, వామన్ రెడ్డి, లోక భూమారెడ్డి, పాయల్ శం కర్, సుహాసిని రెడ్డి, గండ్రత్ సుజాత, ముడుపు ప్రభాకర్ రెడ్డి, కాస్తాల ప్రేమల, టీఎన్జీవో నాయకురాలు వనజ రెడ్డి ఇలా ఎంతో మంది దీక్షా శిబిరంకు మద్దతు పాలకడంతో 1,523 రోజుల పాటు దీక్ష శిబిరం కొనసాగింది. 1969లో తొలిదశ ఉద్యమంలో చాలామంది ఉద్యమకారులు పాల్గొనగా, మలిదశ ఉద్యమం లో సైతం తమ వంతు పాత్ర పోషించారు. 

అమరుల స్థూపాలు..

ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం కోసం ఆదిలాబాద్ జిల్లా నుంచి జనవరి 7, 2010 నుండి ఫిబ్రవరి 15, 2014 వరకు  మొత్తం 27 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారు. అందులో కొందరి అమరవీరుల విగ్రహాలను సైతం వారివారి గ్రామాల్లో నెలకొల్పారు. 

ఆత్మబలిదానాలు చేసుకున్నది వీళ్లే..

1.వామన్ రావు సూర్య, 2.జాదవ్ సాయి కృష్ణ, 3. ఏనుగు భూమారెడ్డి, 4. పుంద్ర చిన్న నర్సింగ్, 5. అమృత్ 6. కోకుల రవీందర్, 7. యాద పెళ్లి దత్తు 8. కంటికి సుధాకర్, 9.దరనాల సంతోష్ 10. కుషనపల్లి సతీష్ కుమార్, 11. బోడ సుమన్, 12. తోట శ్రీనివాస్ 13. నురా కల్పన, 14. బుదే సుమన్, 15. నల్లూరి రాజు, 16. బంధం సురేందర్, 17. అందుగుల మల్లేశ్, 18. రామ్ టెన్ కి శ్రీకాంత్, 19. పిన్న రాజ్ కుమార్, 20. దయ్యాల మల్ల, 21. బోనత్ రాజేందర్, 22. మానే కరణ్, 23. మౌరే గౌతమ్, 24. కలకుంట్ల చిన్న నరసయ్య, 25. పప్పీన్ వార్ శైలేంద్ర, 26. పడిదే గాంగధర్, 27. టి. వేణుగోపాల్ గౌడ్.  

 వెంకటేశ్ బీర్కూర్‌వార్, ఆదిలాబాద్

కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి.. 

తెలంగాణ రాష్ర్టం కోసం ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ పార్టీలో చేరి 2001 నుంచి ఉద్యమంలో పాల్గొన్నారు. పార్టీలో మహిళా జిల్లా అధ్యక్షురాలుగా రాష్ర్ట నాయకురాలుగా పదవుల్లో ఉంటూ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాను. ఉద్యమంలో మహిళలు బయటకు రాని సమయంలో తాను బయటకు వచ్చి ప్రత్యేక రాష్ర్టం ఏర్పడే వరకు మహిళలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో నా వంతు పాత్ర పోషించాను. నేను చేసిన ఉద్యమానికి టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక  2017 జూన్ లో), శిశు సంక్షేమ శాఖ రీజినల్ ఆర్గనైజర్‌గా నామినేటెడ్ పోస్టు తనకు ప్రకటించారు. ఎలాంటి పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోక పోయినప్పటికీ కేసీఆర్ సయంగా ఫోన్ చేసి, ఈ నామినేటెడ్ పోస్టు ఇస్తున్నట్లు చెప్పడం ఎంతో ఆనందంగా అనిపించింది.   

కస్తాల ప్రేమల, ఉద్యమకారిణి

ఆదిలాబాద్ టూ హైదరాబాద్.. 

ప్రత్యేక రాష్ర్టం కోసం జరుగుతున్న ఉద్యమానికి నా జీవనాధారమైన సర్ణకార వృత్తిని సైతం పక్కన పెట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ఆదిలాబాద్‌లో దీక్ష శిబిరంతో పాటు ఎన్నో ఉద్యమాలు కొనసాగించాము. పలుమార్లు హైదరాబాద్‌లో ఉద్యమానికి, పార్లమెంట్ ముట్టడికి సైతం వెళ్లాను. ఎంతో మంది బలిదానాలతో మనస్థాపం చెందిన తాను తెలంగాణ వచ్చే వరకు పాదరక్షలు ధరించనని దీక్షబూని, ప్రత్యేక పూజలు సైతం చేశాను. తెలంగాణ రాష్ర్టం వచ్చాక సంతోషాన్ని సీఎం కేసీఆర్‌తో పంచుకోవాలనే ఉద్దేశంతోఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు 300 కిలోమీటర్లకు పైగా పాదయాత్రను చేపట్టాను.

2021 నవంబర్ 11న ఆదిలాబాద్ నుంచి ప్రారంభించిన పాద యాత్ర 20 రోజుల పాటు చేపట్టాను. రోజు 15 నుంచి 20 కిలోమీటర్ల వరకు నడుస్తూ హైదరాబాద్ కు చేరుకున్న. ప్రగతి భవన్‌కు చేరుకున్న తనను సీఎం కేసీఆర్‌ను కలవనివకుండా పోలీసులు మాయమాటలు చెప్పి పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులకు టీఆర్‌ఎస్ ప్రభుతం, సీఎం కేసీఆర్ సరైన గుర్తింపునివకపోవడం బాధ కలిగించింది. 

ఉద్యమకారుడు శ్రీరామోజు ఆంజనేయులు