25 June, 2026 | 1:46 AM

మెడికవర్‌లో 45 ఏళ్ల వ్యక్తికి ప్రాణదానం

25-06-2026 12:52 AM

అత్యాధునిక వీఏఈసీఎంఓ సాంకేతికతతో చికిత్స

సికింద్రాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): తీవ్రమైన గుండెపోటుతో పాటు గుండె పనితీరు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకున్న హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల రమావత్ రమేష్‌కు సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు అత్యాధునిక వీఏఈసీఎంఓ (వీనో-ఆర్టీరియల్ ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజినేషన్) సాంకేతికతను విజయవంతంగా వినియోగించి ప్రాణాలు కాపాడారు.

గుండె శరీరంలోని కీలక అవయవాలకు అవసరమైన రక్తాన్ని పంపించలేకపోవడంతో ఆయన పరిస్థితి క్షణక్షణం విషమించింది. దీంతో వైద్యులు అత్యాధునిక చికిత్సను అందించాలని నిర్ణయించి కార్డియాలజీ, క్రిటికల్ కేర్ విభాగాల నిపుణుల బృందాలు కలిసి వీఏఈసీఎంఓ చికిత్సను ప్రారంభించాయి. ఈ సాంకేతికత తాత్కాలికంగా గుండె, ఊపిరితిత్తుల పనితీరును భర్తీ చేస్తూ శరీరానికి అవసరమైన రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరాను కొనసాగించింది.

దీంతో గుండె కోలుకునేందుకు అవసరమైన సమయం లభించింది. రమేష్ ఐదు రోజుల పాటు వీఏఈసీఎంఓ మద్దతుతో వైద్యుల నిరంతర పర్యవేక్షణలో ఉన్నారు. అనంతరం గుండె పనితీరు క్రమంగా మెరుగుపడటంతో ఈసీఎంఓ మద్దతును తొలగించి, వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. 14 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఆయనను పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ శివ ప్రసాద్ నాయుడు, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ మాట్లాడుతూ ‘రమేష్ ఆసుపత్రికి చేరుకునే సమయానికి తీవ్రమైన కార్డియోజెనిక్ షాక్‌తో పాటు గుండె ఆగిపోయే ప్రమాదకర స్థితిలో ఉన్నారు.సరైన సమయంలో వీఏఈసీఎంఓచికిత్స ప్రారంభించడం వల్ల శరీరంలోని కీలక అవయవాలకు రక్తప్రసరణ కొనసాగి, గుండె కోలుకునే అవకాశం లభించింది. అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన వైద్య నిర్ణయాలు, అత్యాధునిక సాంకేతికత, సమన్వయంతో పనిచేసే వైద్య బృందం ప్రాణాలను ఎలా కాపాడగలదో ఈ కేసు నిరూపించింది’ అని తెలిపారు.

డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం, హెచ్‌వోడీ అండ్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ మాట్లాడుతూ,‘ఇలాంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగుల చికిత్సకు 24 గంటలపాటు నిపుణుల సమన్వయంతో కూడిన సేవలు అవసరం. ఈ రోగి విజయవంతంగా కోలుకోవడం తీవ్రమైన గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల చికిత్సలో ఈసీఎంఓ పాత్ర ఎంత కీలకమో చాటిచెబుతోంది. అధునాతన క్రిటికల్ కేర్ సేవలు అందుబాటులో ఉండటం ఎంత అవసరమో ఈ విజయం మరోసారి నిరూపించింది’ అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రమోద్ కుమార్ కుచలకంటి-చీఫ్ ఆఫ్ కార్డియాలజీ, డైరెక్టర్ స్ట్రక్చరల్ హార్ట్ అండ్ అడ్వానస్డ్ కొరోనరీ ఇంటర్వెన్షన్స్, డాక్టర్ అమరేంద్ర సింగ్- కార్డియోథొరాసిక్ అండ్ వాస్క్యులర్ సర్జన్, డాక్టర్. సంతోష్ కుమార్- సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ మెడిసిన్, డాక్టర్ చైతన్య కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, డాక్టర్ కృష్ణవేణి- సెంటర్ హెడ్ డాక్టర్‌ప్రశాంత్- మెడికల్ సూపరింటెండెంట్ పాల్గొన్నారు.