16 July, 2026 | 11:37 AM

నీట్ నిందితులకు బీహార్ మంత్రితో లింక్స్

20-06-2024 01:23 AM

పాట్నా, జూన్ 19: నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీ వివాదం ఇంకా తీవ్రతరమైతున్నది. అసలు పేపర్ లీకే కాలేని ఈ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటిస్తుండగా, మరోవైపు పోలీసుల దర్యాప్తులో పేపర్ లీక్‌పై స్పష్టమైన ఆధారాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా బీహార్‌లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం సంచలనం సృష్టిస్తున్నది. తాజాగా పేపర్ లీక్ నిందితులకుతో ఏకంగా ఒక రాష్ట్ర మంత్రికి సంబంధాలున్నట్టు బయటపడింది. బీహార్‌లో పేపర్ లీకేజీపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇప్పటికే 9 మంది అభ్యర్థులతోపాటు 13 మందిని అరెస్టు చేశారు.  అరెస్టయిన అభ్యర్థుల్లో అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి పోలీసులకు ఓ మంత్రి పేరు చెప్పినట్టు సమాచారం.

ఆ మంత్రి పేరును బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ అతడు నీట్ పేపర్ కోసం తన లెటర్‌హెడ్‌పై లేఖ అందించాడని అనురాగ్ వెల్లడించాడు. పోలీసులుక ఆ మంత్రి లెటర్ హెడ్ కూడా చూపించాడని సమాచారం. పాట్నాలోని ఎన్‌హెచ్‌ఏఐ ప్రభుత్వ గెస్ట్‌హౌస్‌లో తాను మంత్రిని మే 4న కలిశానని, ఆయన తన లెటర్ హెడ్‌పై లేఖ రాసి పరీక్ష పేపర్ కోసం రికమెండ్ చేశాడని విద్యార్థి చెప్పినట్టు తెలిసింది. బీహార్‌లో ఓ వ్యవస్థీకృత ముఠా నీట్ పేపర్‌ను ఒక్కో అభ్యర్థికి రూ.32 లక్షలకు అమ్మినట్టు ఇప్పటికే బయటపడింది. ఈ ముఠాలో దనాపూర్‌లో పనిచేస్తున్న ప్రభుత్వ జూనియర్ ఇంజినీర్ సికందర్ యదవేందు కూడా సభ్యుడే. సికందర్‌కు అనురాగ్ బంధువు. సికందర్‌కు సదరు మంత్రితో మంచి సంబంధాలున్నట్టు సమాచారం.