మృత్యువుతో చిన్నారి పోరాటం.. దాతల కోసం ఎదురుచూపు!
కాలేయ వ్యాధితో మూడేళ్ల చిన్నారి దేవాన్షి విలవిల
రూ.30 లక్షల ఖర్చు.. కన్నీటితో సాయం కోసం తల్లిదండ్రుల వేడుకోలు
హుజురాబాద్,సెప్టెంబర్ 27(విజయక్రాంతి): పలకా బలపం పట్టుకుని బడిబాట పట్టాల్సిన వయసు. ఆడుతూ పాడుతూ తల్లిదండ్రుల ఒడిలో గడపాల్సిన చిన్నారి. కానీ విధి ఆ కుటుంబంపై పగబట్టినట్లు.. మూడేళ్ల దేవాన్షి నేడు ఆస్పత్రి మంచంపై మృత్యువుతో పోరాడుతున్నాడు. కాలేయ వ్యాధి(Liver disease) తీవ్రరూపం దాల్చడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారిని కాపాడేందుకు తల్లిదండ్రులు దాతల సాయం కోసం కన్నీటితో ఎదురుచూస్తున్నారు.
హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన జడల సుధాకర్, మౌనిక దంపతుల కుమారుడు దేవాన్షి (3). రెండు నెలల క్రితం తీవ్ర జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్య పరీక్షల్లో పుట్టుకతోనే కాలేయ సంబంధిత తీవ్ర సమస్య ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇప్పటికే చికిత్స కోసం సుమారు రూ.5 లక్షల వరకు ఖర్చు చేసినప్పటికీ చిన్నారి ఆరోగ్యం మెరుగుపడలేదు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని రెయిన్బో ఆస్పత్రికి తరలించారు.
నిపుణులైన వైద్యులు పరీక్షించి చిన్నారి ప్రాణాలను కాపాడాలంటే అత్యవసరంగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుందని సూచించారు. ఇందుకు సుమారు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఉన్న ఆర్థిక స్థోమతకు మించి ఖర్చు కావడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.“మా బిడ్డను కాపాడండి.. మీరే మాకు దేవుళ్లు” చిన్నారి ఆస్పత్రి మంచంపై ప్రాణాలతో పోరాడుతుండగా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పటికే అప్పులు చేసి చికిత్స చేయించిన తమకు ఇప్పుడు రూ.30 లక్షల భారీ మొత్తాన్ని సమకూర్చడం సాధ్యం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు, దాతృత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవతావాదులు ముందుకొచ్చి తమ బిడ్డ ప్రాణాలను కాపాడేందుకు ఆర్థిక సహాయం అందించాలని వేడుకుంటున్నారు.
ఒక చిన్నారి ప్రాణం కోసం చేస్తున్న ఈ పోరాటంలో ప్రతి సహాయం విలువైనదే. మీకు సాధ్యమైనంత చిన్న మొత్తమైనా దేవాన్షి చికిత్సకు అందిస్తే, అది ఆ కుటుంబానికి ఒక పెద్ద ఆశగా మారుతుంది. ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. “మీరు అందించే సహాయం ఎంత చిన్నదైనా.. మా బిడ్డ జీవితానికి అది ఎంతో పెద్ద అండ. మా దేవాన్షిని కాపాడేందుకు దయచేసి ముందుకు రండి” అంటూ తల్లిదండ్రులు కన్నీటితో వేడుకుంటున్నారు.
దేవాన్షి చికిత్సకు సహాయం చేయాలనుకునే దాతలు క్రింది నంబర్‌కు ఫోన్‌పే/గూగుల్‌పే ద్వారా తమకు తోచినంత సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఫోన్‌పే / గూగుల్‌పే: 99499 46640 మానవతా దృక్పథంతో స్పందిద్దాం.. మూడేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు మనవంతు చేయూత అందిద్దాం.