25 July, 2026 | 1:47 AM

శాంతిఖని గనిలో ఊపిరాడటం లేదు..

25-07-2026 12:26 AM
  1. బొగ్గు ఉత్పత్తికి ప్రాణాలు పణం.! 
  2. విధులకు వణికిపోతున్న కార్మికులు
  3. పెరిగిన పనీ ఒత్తిడి
  4. పట్టని కార్మికుల కష్టాలు 
  5. చోద్యం చూస్తున్న కార్మిక సంఘాలు 

బెల్లంపల్లి, జూలై 24: భూగర్భగనుల్లో ఊపిరాడనీ విషమ పరిస్థితి సింగరేణిలో రాజ్యమేలుతున్నది. పని స్తలాల్లో కనీస సౌకర్యాలు లేవు. బొగ్గు ఉత్పత్తి కోసం కార్మికుల ప్రాణాలు పణంగా పెడుతున్నారు. విధులకు వెళ్లాలంటేనే.. కార్మికులు జంకుతున్నారంటే గనిలో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతున్నది.

ఇంతకీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎక్కడంటారా? సింగరేణిలో గనుల కల్పవల్లి గా పెరెన్నిక అయిన బెల్లంపల్లి శాంతిఖనిలో ఈ పరిస్థితీ నెలకొంది. ప్రాణాలకు గ్యారంటీ లేని పనిస్థలాల్లో కార్మికులతో పనిచేస్తున్నారు. యావత్తు సౌత్ డిస్ట్రిక్ లో ఇదే పరిస్థితి నెలకొంది. 38 నుంచి 40 లెవెల్ వరకూ..అన్ని పని స్థలాల్లో కనీస గాలి సప్లయ్ లేదు. ఊపిరాడనీ ప్రమాదకర పరిస్థితిలో కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టీ పని చేస్తున్నారు. గనిలో గాలీ, నీరు, రక్షణ సదుపాయాలు పూర్తిగా మృగ్యం. కార్మికుల ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోయింది.

అధికారులు కనీస సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ఇది వారి విధి ధర్మానికి సంబంధం లేనిదిగా చూస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారన్న విమర్శలు భగ్గుమంటున్నాయి. సింగరేణిలో రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని మాత్రమే కొరుకుతున్నది కంపెనీ అధికారులు ఇంతకాలం చెబుతున్న మాటలు పచ్చి భూటకమని మరోసారి రుజువు అయ్యింది. కార్మికుల ప్రాణాలను బలిపెట్టి బొగ్గు ఉత్పత్తి తీయాలని ఏ చట్టంలో ఉందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

సింగరేణిలో మైనింగ్ చట్టాలు ప్రచారం తప్పితే అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఒక్క క్షణం గనిలో పనిచేయలేని దుస్థితిలో కార్మికులను బలవంతంగా పని చేపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క రోజు డ్యూటీ చేసిన కార్మికుడు మరుసటి రోజు విధులకు వెళ్లలేకపోతున్నారు.  ప్రాణభయంతో దినదినం గండంగా కార్మికులు కాలం వెళ్లధీస్తున్నారు. పని స్థలాలు  కార్మికుల పాలిటి మృత్యు గుహలుగా మారిపోయాయంటే అతిశయో శక్తి కాదు. గనిలో తగినంత గాలి అందక కార్మికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

చోద్యం చూస్తున్న కార్మిక సంఘాలు..

శాంతిఖనిలో కార్మికులు అష్టకష్టాలు పడుతుంటే, కార్మిక సంఘాలు తమకే పట్టనట్టు ఉండి పోతున్నాయి. ఊపిరాడని పని స్థలాల్లో కార్మికులు నిత్యం మృత్యువుతో పోరాడుతున్నారు. ఏ కార్మిక సంఘం కూడా స్పందించక పోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. అటు అధికారులు ఇటు కార్మిక సంఘాలకు కార్మికుల బాగోగులు అవసరం లేకుండా పోయాయి. సహజంగానే అధికారులు కార్మికుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.

కానీ కార్మిక సంఘాలు అలా ఉండకూడదుకదా? కానీ కార్మిక లీడర్లు సహితం అధికారులకు తీసిపోకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే  కార్మికుల సంక్షేమంపై ఇరువురు చేతులెత్తేశారన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్థానిక అధికారుల పనితీరులో మార్పుకోసం ప్రక్షాళన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రక్షణ, గాలీ వంటి మౌళిక సదుపాయాల కల్పనను, సంక్షేమాన్ని నిరక్ష్యం చేస్తున్న అధికారులుపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ను పలువురు వ్యక్తం చేస్తున్నారు.