30 June, 2026 | 7:28 PM

పీఎం కిసాన్ దారిలో రుణమాఫీ?

13-06-2024 01:19 AM

నిబంధనలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 

ఇతర రాష్ట్రాల పథకాలూ పరిశీలన

వారం రోజుల్లో క్యాబినెట్ సమావేశం 

రుణమాఫీపై నిర్ణయం తీసుకొనే అవకాశం  

ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామన్న సర్కారు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): రైతు రుణమాఫీ అమలుకు నిబంధనలు, విధి విధానాలు ఎలా ఉండాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనలను అధ్యయనం చేస్తున్నది. గతంలో జరిగిన రుణమాఫీ అమలు తీరును కూడా పరిశీలిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాలు, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలకు అనుసరించిన పద్ధతులు, నిబంధనలను కూడా అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం ద్వారా దేశంలో అర్హులైన రైతులందరికీ ఏడాదికి రూ.6 వేల ఆర్థిక సాయాన్ని కేంద్రం అందిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీలు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, అధిక ఆదాయం ఉండి ఐటీ (ఇన్‌కం టాక్స్) చెల్లిస్తున్నవారిని కేంద్రం ఈ పథకం నుంచి మినహాయించింది.

రుణ మాఫీ అమలుకు అటువంటి ప్రత్యేక మార్గదర్శకాలు పాటించాలా? వీటితో అసలైన రైతులకు మేలు జరుగుతుందా? ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి రైతుకు మేలు జరగాలంటే ఎలాంటి విధి విధానాలు ఉండాలి? అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతుల కు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో పథకం మార్గదర్శకాలు, అర్హతలను పరిశీలించడంలో అధికారులు తలమునకలయ్యారు. 

వారంలో క్యాబినెట్ భేటీ

రుణమాఫీ విధి విధానాలు ఖరారు చేసేందుకు వారం రోజుల్లో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువులోగా రుణమాఫీ చేసేందుకు సన్నాహాలు చేయాలని ఇటీవలే వ్యవసాయ, ఆర్థిక శాఖల అధికారులను సీఎం ఆదేశించారు. రుణమాఫీకి ఎన్ని నిధులు కావాలి? దానికి తగ్గట్టుగా నిధుల సమీకరణకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలు, అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మరోవైపు రుణమాఫీ అమలుకు ఏ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలి? అసలైన అర్హులకు లబ్ధి చేకూరేలా విధి విధానాలు ఎలా ఉండాలనే కసరత్తు మొదలు పెట్టింది.