30 June, 2026 | 6:14 PM

కొలువుదీరిన బాబు క్యాబినెట్

13-06-2024 01:22 AM

పండుగలా ప్రమాణ స్వీకారోత్సవం.. హాజరైన ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు

డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ప్రమాణం

24 మంది మంత్రుల్లో 17 మంది కొత్త వారే..

జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరు

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం బుధవారం కొలువుదీరింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వేదికగా బుధవారం ఉదయం 11.27 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. చంద్రబాబుతో ముఖ్యమంత్రిగా ప్రమా ణం చేయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారంచేశారు. మంత్రివర్గం కూర్పులో భాగంగా జనసేన నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

మంత్రివర్గ కూర్పులో సీనియర్లకు, యువతకు, మధ్య సమతూకం పాటించారు. ప్రమా ణంచేసిన 24 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం. ముగ్గురు మహిళలకు మంత్రివర్గంలో చోటు లభించింది. బీసీలు ౭ మంది, ఎస్సీలు ఇద్దరు, ఒకరు ఎస్టీ, ముస్లిం మైనార్టీ నుంచి ఒకరు, ఆర్యవైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం ఇచ్చారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, నాదేండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్‌కు అవకాశం దక్కింది.

ఈ కార్యక్రమానికి ప్రధాన నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు అమిత్‌షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, బండి సంజయ్, లోక్‌జన్ శక్తి పార్టీ చీఫ్ చిరాగ్ పాశ్వాన్, రాందాస్ అథవాలే, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, మాజీ సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై, ఎంపీ ఈటల రాజేందర్, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్, రాంచరణ్, నాగబాబు, పవన్‌కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, పిల్లలు ఆకిరా నందన్, ఆద్య మార్క్ శంకర్ పవనోచ్, పోలేనా అంజనా తదితరులు హాజరయ్యారు. ముఖ్యంగా అక్కా చెల్లెల్లున బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం నారా చంద్రబాబునాయుడు  సతీమణి నారా భువనేశ్వరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మంత్రులుగా ప్రమాణం చేసినవారు

పవన్ కల్యాణ్ (జనసేన), నారా లోకేశ్ (టీడీపీ), అచ్చెన్నాయుడు (టీడీపీ), కొల్లు రవీంద్ర (టీడీపీ), నాదేండ్ల మనోహర్ (జనసేన), పీ నారాయణ (టీడీపీ), వంగలపూడి అనిత (టీడీపీ), సత్యకుమార్ యాదవ్ (బీజేపీ), నిమ్మల రామానాయుడు (టీడీపీ), ఎన్‌ఎండీ ఫరూక్ (టీడీపీ), ఆనం రామనారాయణరెడ్డి (టీడీపీ), పయ్యావుల కేశవ్ (టీడీపీ), అనగాని సత్యప్రసాద్ (టీడీపీ), కొలుసు పార్థసారథి (టీడీపీ), డోలా బాలవీరాంజనేయస్వామి (టీడీపీ), గొట్టిపాటి రవికుమార్ (టీడీపీ), కందుల దుర్గేశ్ (జనసేన), గుమ్మడి సంధ్యారాణి (టీడీపీ), బీసీ జనార్దన్‌రెడ్డి (టీడీపీ), టీజీ భరత్ (టీడీపీ), ఎస్ సవిత (టీడీపీ), వాసంశెట్టి సుభాష్ (టీడీపీ), కొండపల్లి శ్రీనివాస్ (టీడీపీ), మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి (టీడీపీ).

మోదీ ఆప్యాయతకు సభ కేరింతలు

హైదరాబాద్, జూన్ 12 ( వియక్రాంతి) : చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపైనుంచి దిగుతూ ప్రధాని నరేంద్ర మోదీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చేయి పట్టుకుని నడువడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రధాని మోదీ తనకు ఎదురుగా వస్తున్న పవన్‌కల్యాణ్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని కూడా ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు. వారిద్దరినీ ఆలింగనం చేసుకోవడం మరో విశేషం. తర్వాత స్టేజీ మధ్యలో నిలబడి ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన వారందరికీ అభివాదం చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా సభలోని కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. దీంతో సభా ప్రాంగణమంతా దద్దరిల్లింది.