30 June, 2026 | 8:36 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

మొరం దందా.. ఆపేదుందా?

13-06-2024 01:18 AM

కాంట్రాక్టర్లకు కాసులు కురిపిస్తున్న మట్టిదందా

మామూలుగా వదిలేస్తున్న అధికారులు

బెల్లంపల్లి, జూన్ 12 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో మొరం దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అక్రమార్కులు మట్టి సంపదను అడ్డంగా దోచేస్తున్నారు. ఒక్క బెల్లంపల్లి ప్రాంతంలోనే పదుల సంఖ్యలో మొరం మట్టిని తవ్వేప్రదేశాలుండటం గమనార్హం. రెవెన్యూ, మైనింగ్ అధికారు లు ఈ విషయంలో పెద్దగా పట్టించుకోకపోవడం అక్రమార్కులకు వరంగా మారుతోంది. ఇప్పటికే మొరం, మట్టి తవ్వకాలతో కొన్ని ప్రాంతా లు బొందలగడ్డగా మారి ప్రమాదకరంగా తయారయ్యాయి. పగలూ, రాత్రీ తేడా లేకుండా యధేచ్ఛగా ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నా అడిగే నాథు డే లేకుండా పోతున్నారన్న విమర్శలున్నాయి.

బెల్లంపల్లి పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో నూతన నివాస గృహాలు, వ్యాపా ర భవన సముదాయాల నిర్మాణాలు పెద్ద ఎత్తున చేపడుతుండటంతో మొరం మట్టికి డిమాం డ్ పెరిగిపోయింది. ఇది అక్రమార్కులకు కలసి వస్తోంది. చెరువులు, కుంటలు, అటవీభూములను వదిలిపెట్టకుండా మొరం తవ్వకాలకు తెగబడుతున్నారు. ట్రాక్టర్ టిప్పుకు రూ. 3౦౦ నుంచి రూ.5౦౦వరకు అమ్ముకుంటూ అక్రమ వ్యాపారానికి తెరలేపుతున్నారు. పెద్దఎత్తున మొరాన్ని తరలి స్తున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావడం లేదు.బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ వెనుకాల గల  భూమి లో పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు మొరం మట్టి తవ్వకాలు జరిపారు.

బెల్లంపల్లి పోచమ్మచెరువు ప్రాంతం లో చెరువు శిఖం భూముల్లో నూ పెద్ద ఎత్తున మొరం తవ్వకాలకు తెగబడటంతో ప్రమాదకరమైన గుంతలు ఏర్పడ్డా యి. అదే ప్రాంతంలోని ఎర్ర చెరువు శిఖం భూముల్లో నూ రాత్రి సమయాల్లో యథేచ్చగా ప్రొక్లెయినర్లతో మొరం తవ్వకాలను పెద్ద ఎత్తున చేపడుతున్నారు. బెల్లంపల్లి ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్ ఎదురుగా గల సింగరేణి మ్యాగ్జిన్ ప్రాంతంలో కూడా మట్టిని తవ్వి యధేచ్చగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా బెల్లంపల్లి, మంచిర్యాల ఫ్లువర్‌బ్రిడ్జి కింద గల కుంటరాములు బస్తీలో అటవీశాఖకు చెందిన భూమి లో మొరం తవ్వకాలు జరుగుతున్నా అటవీ అధికారులు మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

ఇదిలా ఉంటే కన్నాల లక్ష్మిపూర్ ప్రాంతంలో స్థానిక నాయకుడొకరు తన అనుయాయులతో మూసివేతకు గురైన సింగరేణిమైన్ భూమి లో పెద్ద ఎత్తున మొరం తవ్వకాలను చేపట్టి మట్టిదందాను కొనసాగించారు. ఇదే ప్రాం తంలో నిర్మాణాల కోసం బొక్కలగుంట చెరువులో మట్టి తరలింపును  యథేచ్ఛగా చేపట్టినా చర్యలు తీసుకోలేదు. బుగ్గగూడెం ప్రాజెక్టులో కొన్ని రోజులుగా రాత్రి వేళల్లో మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. బుగ్గగూడెం గ్రామస్థులు ప్రాజెక్టు భూమిలో జరుగుతున్న మొరం తవ్వకాలను అడ్డుకోవడంతో ప్రస్థుతం మొరం మట్టి తవ్వకాలకు బ్రేక్ పడింది. నియోజకవర్గంలోని పలుచోట్ల  అధికారులకు వంతపాడు తూ అక్రమార్కులు మట్టిదందాను మూడు పువ్వులూ, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నా రు. సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా మొరం తవ్వకాలపై దృష్టి సారించి మట్టిదందాకు అడ్డుకట్ట వేయాలన్న అభిప్రాయాలు ప్రజల నుండి వ్యక్తమౌతున్నాయి.