7 April, 2026 | 3:04 AM

అభివృద్ధి పని.. నాణ్యత ఏడున్నదని

07-04-2026 01:13 AM

పరిధికి మించి డస్ట్ వినియోగం 

మిగులు వాటికే 

ప్రాధాన్యతనిస్తున్న కాంట్రాక్టర్లు 

పట్టించుకోని అధికారులు 

నాణ్యతతో కూడిన పనులు చేయాలని స్థానికుల వేడుకోలు

కోదాడ, ఏప్రిల్ 6: కోదాడ నియోజకవర్గంలో సీసీ రోడ్లు, సమైక్య సమభవన సంఘాలు, నూతన ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నా, వాటిలో నాణ్యత సమస్యలు తీవ్రముగా ఉన్నాయని ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం పథకంగా ముందుకు తీసుకువెళ్తున్నప్పటికీ, అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలను పాటించడంలో విఫలమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో అభివృద్ధి పని నాణ్యత యాడ ఉన్నదని చర్చలు స్థానికంగా జరుగుతున్నట్టు తెలుస్తుంది. అంతా డస్ట్.. పనులు వేస్ట్ .. : భవన నిర్మాణ నిబంధనల ప్రకారం, ఇసుక కొరత ఉన్నప్పుడు 40% ఇసుక, 60% డస్ట్ కలిపి ఉపయోగించాలని ప్రభుత్వం సూచించింది. కానీ కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు ఈ నిబంధనను పాటించక, 20% ఇసుక, 80% డస్ట్తో మాత్రమే పని చేస్తున్నారు. ఫలితంగా భవనాలు పగుళ్లతో సమస్యలు ఎదుర్కోవచ్చని, కొన్నిసార్లు ఎండలలోనే భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పదేపదే వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం, అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను మిగులుచుకునేందుకు కొంతమంది నాయకులు, కాంట్రాక్టర్లతో కలిసి చక్రం తిప్పుతున్నట్లు వినికిడి. ప్రజలు, భవనాలు నాణ్యతలో తగిన విధంగా నిర్మించబడకపోవడం, భవిష్యత్తులో అనుకోని ప్రమాదాలు జరుగుతాయని భయపడుతున్నారు. ప్రాంతంలోని భవన నిర్మాణ నాణ్యత, ఇసుక, సిమెంట్, డస్ట్ వినియోగం పై అధికారులు కఠిన నియంత్రణ అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు వేసిన తర్వాత క్యూరింగ్ చేయకపోవడంతో పగుళ్లు ఏర్పాడ్డాయి. ఇప్పటికైనా జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో జరిగేలా అధికారులు చూడాలని ప్రజలు కోరుతున్నారు.

నాణ్యత లోపం మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం

ప్రభుత్వ పనుల్లో నాణ్యతా లోపం గురించి ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. మాకు సమాచారం అందిన వెంటనే చర్యలు తీసుకుంటాము. అభివృద్ధి పనులు చేసేవారు ఎంతటి వారైనా ఖచ్చితంగా నాణ్యతతో చేయాల్సిందే.

సాయిరాం, డీఈ,  పంచాయతీరాజ్, కోదాడ