బాబోయ్.. ఇవేం ఖర్చులు!

05-05-2024 02:01:44 AM

పరిమితికి మించి అభ్యర్థుల వ్యయం

తడిసి మోపెడవుతున్న ప్రచార ఖర్చులు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి) : లోక్‌సభ ఎన్నికల ప్రచారం మరో ఏడు రోజుల్లో ముగియనుంది. దీంతో నగరంలో ప్రధాన పార్టీ అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరింది. మండుటెండల్లోనూ అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా పరిమితికి మించి డబ్బు ఖర్చు పెడుతున్నారు. దీంతో, ప్రచార ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున డబ్బులను సమీకరించేందుకు తంటాలు పడుతున్నారు. కాగా, ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసిన నాటి నుంచి చేసే ఖర్చులన్నీ ఎన్నికల ఖర్చు కిందకే వస్తాయి.

ఒక్కో ఎంపీ అభ్యర్థి తమ ప్రచారానికి రూ.95 లక్షలకు మించి ఖర్చు పెట్టొద్దనే నిబంధనలున్నాయి. కానీ అభ్యర్థులు అంతకు మించి ఖర్చు పెడుతున్నారని సమాచారం. ఇక ప్రధాన పార్టీల అభ్యర్థులకైతే ఆ రూ.95 లక్షలు ఒక్కరోజు ప్రచారానికి కూడా సరిపోవడం లేదని తెలుస్తోంది. గతంలో లాగే ఈ ఎన్నికల్లో కూడా డబ్బు ప్రవాహం కొనసాగనుందని ఎన్నికల ప్రచార సరళిని బట్టి తెలుస్తోంది. అయితే, ఇంత జరుగుతున్నా ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని ఎన్నికల కమిషన్ అడ్డుకోవడంలో విఫలమవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందు కంటే, గతంలో మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు వందల కోట్లు ఖర్చు చేసినా నిలువరించలేకపోయిందని ఎలక్షన్ కమిషన్‌పై అపవాదు ఉంది.

ప్రచారానికో రేటు.. వీఐపీ మీటింగుకో రేటు

అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించడానికి ఓ రేటు, అభ్యర్థి వస్తే ఓ రేటు, వీఐపీ నాయకులొస్తే మరో రేటు అనే రీతిలో ప్రజలు ఆయా పార్టీల సమావేశాలకు వెళుతున్నారు. ప్రచారంలో పాల్గొన్న ఒక్కొక్కరికి రూ. 300 రూ. 500 వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం. కాలనీ దాటి బయటకు వెళితే రూ.1000 వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రచారానికి వచ్చిన వారికి భోజనం, వారి సాధక, బాధకాలనూ అభ్యర్థులే చూసుకుంటున్నారు. అయితే, పార్టీ మారినా ప్రచారానికి వచ్చే జనం మారకపోవడం గమనార్హం. దీంతో ప్రచారంలో పాల్గొన్న వారు ఏ పార్టీకి ఓటేస్తారో తెలీక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉండగా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు, అగ్రనాయకులు వచ్చే సభలు, కార్నర్ మీటింగ్‌ల ఏర్పాట్లకు భారీగా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశలకు జనాన్ని తరలించడంతో పాటు, సభ ఏర్పాట్లు చేయడం కూడా అభ్యర్థులకు సవాలుగా మారుతోంది. నిత్యావసర ధరలతో పాటు ఎన్నికల సామాగ్రి, ప్రచార ఖర్చులు భారీగా పెరిగాయి. మండుతున్న ఎండలు ఆ భారాన్ని మరింత పెంచుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం వల్ల ప్రచారానికి కార్యకర్తలు, ప్రజలు రావడానికి జంకుతున్నారు. వారికి ఉపశమనం కోసం చల్లని నీళ్లు, పానియాలు, ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది. 

ఎలక్షన్ కమిషన్ దృష్టి ఉన్నా..

అభ్యర్థుల ఖర్చుపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారిస్తోంది. ప్రజలను ప్రలోభాలకు గురిచేయకుండా చర్యలు తీసుకున్నట్లు చెబుతోంది. అభ్యర్థులు ప్రచారం చేసే చోట వారు ఉపయోగించే కరపత్రం మొదలుకొని ప్రతీ సామాగ్రిని వీడియో రికార్డు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వ్యయ పరిశీలకులు ఎప్పటికప్పుడు అభ్యర్థుల ఖర్చులను పరిశీలిస్తున్నా లెక్కకు మించి ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు, గత శాసనసభ ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ ఎంత దృష్టి సారించినా డబ్బు కట్టల ప్రవాహాన్ని నిలువరించలేకపోయిందనే ఆరోపణలున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ అభ్యర్థుల ఖర్చును నిలువరించగలుగుతుందా? లేదా? చూడాలి. 

బూత్‌ల వారీగా ఖర్చులు..

ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతోన్న సమయంలోనూ అభ్యర్థులు సొంత కార్యకర్తలకూ ఖర్చు పెట్టాల్సి వస్తోందని, లేదంటే కార్యకర్తలు నొచ్చుకొని ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉందని పలువురు నాయకులు చెబుతున్నారు. ప్రచారంలో భాగంగా ఒక బూత్‌కు రోజుకు రూ.20 వేల వరకు ఖర్చవుతోందని తెలుస్తోంది. ఈ లెక్క ప్రకారం ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో రోజుకు దాదాపు రూ. 30 లక్షల వరకు ప్రచారానికే ఖర్చవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా ముఖ్య కార్యకర్తలు, వివిధ సామాజిక వర్గాల సమావేశాలు, యువత, మహిళలు, పేరిట సమావేశాలు నిర్వహించి వారికి విందులను ఏర్పాటు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకోసం కూడా భారీగానే ఖర్చవు తోందని తెలుస్తోంది.