2 April, 2026 | 2:50 AM

ఆర్ ఆర్ ట్యాక్స్‌తో దోపిడీ

02-04-2026 12:44 AM

అప్పుడు బీఆర్‌ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణను నిర్లక్ష్యం చేశాయి 

కాంగ్రెస్ కారణంగానే ఏపీలో 8, తెలంగాణలో ఒకటే ఎయిర్‌పోర్టు

అమరావతిలో అద్భుతమైన అభివృద్ధి జరగాలి 

తెలుగు రాష్ట్రాలు పోటీతత్వంతో ముందుకు సాగాలి

లోక్‌సభలో ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మద్దతు

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): అమరావతి అద్భుతమైన రాజధా నిగా అభివృద్ధి జరగాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొ న్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీతత్వంతో ముందుకు సాగాల న్నారు. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లుకు బుధవారం లోక్‌సభలో కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించారు. చర్చ తర్వాత లోక్‌సభలో ఆ బిల్లు ఆమోదం పొందింది.

చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విభజన జరిగి పదేళ్లవుతున్నా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 8 విమానాశ్రయాలుంటే తెలంగాణలో ఒక్కటే ఉందని, దీనికి కారణం అప్ప టి కాంగ్రెస్ పార్టీయే అన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను నిర్లక్ష్యం చేసింది కాబట్టే.. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.

గతంలో పదేళ్ల పాటు తెలంగాణను బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్‌ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణను దోచుకుంటోందని ఆరోపించారు. దీన్నుంచి తెలంగాణ ప్రజలు జాగృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణను తెచ్చుకున్నామో.. ఆ లక్ష్యాల సాధన జరగడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల పోరాటాన్ని నవ్వులపాలు చేసే విధంగా కాంగ్రెస్ పాలన రాష్ట్రంలో సాగుతోందని మండిపడ్డారు. 

ఆ పాపం కాంగ్రెస్‌దే..

సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, కాంగ్రెస్ పార్టీ 1969లో జై తెలంగాణ అన్నందుకు 369 మంది ఉద్యమకారులను కాల్చి చంపిందని, ఆ తర్వాత చివరిదశ తెలంగాణ ఉద్యమంలోనూ.. 1,200 మంది ఆత్మబలిదానం చేశారన్నారు. వారి త్యాగంతోనే తెలంగాణ వచ్చిందని, నాలుగు కోట్ల మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారన్నారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత.. తెలంగాణతోపాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా పోటీగా అభివృ ద్ధి చెందాలని భావించామని, కానీ అక్కడి ప్రజలు తమకు రాజధాని లేదని బాధపడే పరిస్థితి నెలకొనడం దురదృష్టకరమన్నారు. తెలంగాణలో విమానాశ్రయాలు లేకపోవడానికి కారణం ఎవరో... ఆ పాపం పాపం ఎవరిదో చెప్పగలరా? అని కాంగ్రెస్‌ను ప్ర శ్నించారు.

నాటి  కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విమానాశ్రయాలు ఇవ్వలేదని,  తెలంగాణ వచ్చిన తర్వాత  కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్‌లలో విమానాశ్రయాలకు భూమికోసం నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి లేఖలు రాసినా.. ఈ విమానాశ్రయాలకు భూములు ఇవ్వలేదని, కనీసం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రైల్వేలు, జాతీయ రహదారుల అభివృద్ధి జరగలేదని, తెలంగాణ అనేక రకాలుగా వెనుకబడింది కాబట్టే.. ప్రత్యేక రాష్ట్ర ఉద్య మం వచ్చిందన్నారు.

కచ్చితంగా ఇవాళ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని, ఆ దిశగా ఓ సానుకూలమైన పరిస్థితి రావ డం చాలా సంతోషంగా ఉందన్నారు. అన్నదమ్ముల్లాగా ఈ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏపీలో కూడా గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటైందని, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తోందన్నారు.

42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ

 తెలంగాణలో నూ రైల్వేలు, జాతీయ రహదారులు అభివృద్ధి పనులకు కేంద్రం అండదండగా నిలుస్తోందని చెప్పారు. 42 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ ఏకకాలంలో చేసుకుంటున్నామని, గతంలో 2,500 కిలోమీ టర్ల జాతీయ రహదారులుంటే.. ఈపదేళ్లలో అదనంగా దాదాపు 3వేల కిలోమీటర్ల  జాతీ య రహదారుల నిర్మాణం జరిగిందన్నారు. 

లోక్‌సభ అమోదం..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ పునర్విభజన చట్ట సవరణ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. సుమారు రెండు గంటలపాటు దీనిపై చర్చ జరిగింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్, వైసీపీ, సమాజ్‌వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు.

అనంతరం బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ ప్రకటించారు. ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. లోక్‌సభలో ఆమోదం పొందిన అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు వచ్చినట్లు సెక్రటరీ జనరల్ ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాజ్యసభలో దాదాపు గంటసేపు ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది.