మధ్యాహ్న భోజనానికి ఆటంకం
ఈనెల 6 నుంచి జరగవలసిన 10వ తరగతి ప్రీఫైనల్ పరీక్షల సమయం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం మధ్యాహ్నం 12.15 నుంచి 3.15 ని.ల వరకుగా నిర్ణయించింది. ఇది ఎంతవరకు సరైందో అధికారులు ఒక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉన్నత పాఠశాల సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.15గా ముందుకు జరిపారు. ఈ సమయం ఆధారంగా మధ్యాహ్నం భోజనం సమయం 12.30 నుంచి 1.15గా నిర్ణయించారు. అయితే, ప్రీఫైనల్ పరీక్షలు రాసే 10వ తరగతి పిల్లలు ఎప్పుడు మధ్యాహ్న భోజనం చేయాలి? గంట ముందు చేయాలని భావిస్తే పాఠశాలలో వంట చేసేవాళ్ళు ఎప్పుడు వచ్చి వంట చేయాలి? పాఠశాల పిల్లలందరూ 10.30 ని.లకు భోజనం చేస్తే, 10వ తరగతి పిల్లలు ముందుగా భోజనం చేస్తే పాఠశాలలో వారు పరీక్షలు రాయటం, వీరు భోజనం చేయటం ఎంత క్రమశిక్షణా రహితంగా ఉంటుంది! ఇదంత పాఠశాల క్రమశిక్షణను దెబ్బతీసేలా ఉంది.
దీనిని సరిచేయవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఙప్తి. ఉదయం 9.15 నుంచి సా.4.15 వరకు పాఠశాల సమయం పరీక్షలు నిర్వహించడానికి 3 గంటల సమయాన్ని మధ్యాహ్న భోజన సమయానికి ఆటంకం కలగకుండా రాష్ర్ట ప్రభుత్వ పరీక్షల విభాగం సమయాన్ని నిర్ణయించలేదా? రంజాన్ మాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమయాన్ని నిర్ణయించినట్లయితే కొందరు పిల్లల కోసం ఎక్కువ మంది పిల్లలు బాధ పడవలసిందేనా? ఒకటికి రెండుసార్లు ఆలోచించాకే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.
బొజ్జ సురేందర్, అవుతాపురం, మహబూబాబాద్
విద్యార్థుల భవిష్యత్తు మన చేతుల్లోనే!
మన పాఠశాలల్లో పిల్లలకు విద్యా ప్రమాణాలు పెంపొందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుండడం అభినందనీయం. ఈ మేరకు మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రకటన వాస్తవ రూపం దాల్చాలి. ఊరికే ప్రభుత్వ సొమ్ముతో అధికారులు, ఉపాధ్యాయులు విదేశాలు తిరిగి వస్తే ప్రయోజనం ఉండదు. వారు చేసిన సూచనలను అమలులోకి తేవాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యాస్థాయిని మన విద్యార్థులకు అందించే బాధ్యతను ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు జరపాలి. అప్పుడే వారి భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దిన వాళ్లమవుతాం.
- ప్రణీత్‌రావ్, సికింద్రాబాద్






