అమెరికన్లలో గుబులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిస్థాయి టారిఫ్‌ల యుద్ధానికి తెరతీసినట్లుగా కనిపిస్తోంది. తాను అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత చైనా ఉత్పత్తులపై 10 శాతం సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో 10 శాతం సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు కెనడా, మెక్సికో దిగుమతులపైనా 25 శాతం సుంకాల విషయంలోనూ ఎలాంటి మార్పులేదని ప్రకటించారు. అమెరికా కాలమానం ప్రకారం మార్చి 4నుంచి పెంచిన సుంకాలు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
ట్రంప్ అధికారంలోకి రాగానే మిత్ర దేశాలయిన కెనడా, మెక్సికోలతో పాటుగా చైనాపై కూడా సుంకాల కొరడా ఝళిపించారు. ఫిబ్రవరి 4నుంచే ఇవి అమలులోకి వస్తాయని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్, కెనడా ప్రధాని ట్రూడో ఆయనతో ఫోన్‌లో మాట్లాడి సరిహద్దు భద్రతకు సైన్యాన్ని మోహరిస్తామని, వ్యవస్థీకృత నేరాలు, మనీలాండరింగ్, ఫెంటనిల్‌పై పోరాటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో సుంకాల అమలును నెలరోజులు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ గడువు ముగియడంతో మెక్సికో, కెనడాపై సుంకాలు మంగళవారంనుంచి అమలులోకి వస్తాయని ట్రంప్ ప్రకటించారు. కాగా ట్రంప్ ట్రేడ్‌వార్‌పై చైనా, కెనడాలు కూడా దీటుగా స్పందించాయి.
అమెరికానుంచి తమ దేశంలోకి వచ్చే పలు ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధిస్తామని చైనా వాణిజ్య శాఖ ప్రకటించింది. అమెరికానుంచి దిగుమతి చేసుకునే ఆల్కహాల్, పండ్లు సహా 107 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై తాము కూడా 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు కెనడా ప్రకటించగా, మెక్సికో మాత్రం ఇంకా స్పందించలేదు. ఈ ట్రేడ్‌వార్ ప్రభావం ప్రపంచ మార్కెట్లపైనా భారీ ప్రభావం చూపించింది. అమెరికా ప్రధాన సూచీలయిన డౌజోన్స్, ఎస్‌అండ్‌పీ, నాస్డాక్ సూచీలు భారీగా పతనమయ్యాయి.
రెండు అగ్రరాజ్యాల మధ్య మొదలైన ఈ ట్రేడ్‌వార్ ప్రభావం ప్రపంచ దేశాలపై ఎలా ఉన్నా అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీగానే ఉంటుందని విశ్లేషకుల అంచనా. రాబోయే రోజుల్లో ధరలు పెరిగి దాని ప్రభావం వినియోగదారులపై చూపుతుందని వారంటున్నారు. వాస్తవానికి గత నవంబర్‌లో అమెరికా అధ్యక్షఎన్నికల సమయంలో దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఓటర్ల ప్రధానాంశాలుగా ఉన్నాయి. తాను తిరిగి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టగానే బైడెన్ హయాంలో పెరిగిన ధరలతో దేశ ప్రజల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని తొలగిస్తానని ట్రంప్ అప్పట్లో హామీ ఇచ్చారు.
అధికారంలోకి వచ్చాక ట్రంప్ అక్రమ వలసలు అరికట్టడం, ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించడం లాంటి ఎన్నికల హామీలనయితే అమలు చేశారు కానీ ద్రవ్యోల్బణం వైపు మాత్రం దృష్టి పెట్ట్టలేదు.తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఓటర్లు తమ రోజువారీ ఆహారం ఖర్చు పెరిగిపోతుండడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కెనడా, మెక్సికో ఉత్పత్తులపై 25 శాతం విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే అమెరికా స్టాక్ మార్కెట్లు ఈ ఏడాదిలోనే అత్యధికంగా పడిపోవడం చూస్తే రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయని అమెరికన్లు భయపడుతున్నారు.
ట్రంప్ ఇంకా అధ్యక్ష పదవిలో హనీమూన్ పీరియడ్‌ను ఎంజాయ్ చేస్తున్నటికీ ప్రజల్ల్లో ఆయన పాపులారిటీ రేటింగ్ తగ్గిందని, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడంపై ఆయన సక్సెస్ ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరో వైపు ట్రంప్ ప్రకటించిన టారిఫ్ వార్ ప్రమాదకరమైనదిగా ప్రపంచ దిగ్గజ ఇన్వెస్టర్ 94 ఏళ్ల వారెన్ బఫెట్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. కానీ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడయినప్పుడు కూడా ఇలాగే చైనాతో టారిఫ్‌వార్‌కు దిగారు. కానీ ఎక్కువ రోజులు కొనసాగలేదు. వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ తీసుకున్న దుందుడుకు నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.






