పిచ్చి కుక్కల దాడి – ఐదుగురికి తీవ్ర గాయాలు
అంకుసాపూర్ గ్రామంలో పిచ్చి కుక్కల దాడి – ఐదుగురికి తీవ్ర గాయాలు
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో పిచ్చి కుక్కల దాడితో గ్రామంలో భయాందోళన నెలకొంది. గ్రామంలోని గల్లీల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలు అకస్మాత్తుగా దాడి చేసి ఐదుగురికి తీవ్ర గాయాలు చేశాయి. గాయపడిన వారిలో సుమారు ఐదు సంవత్సరాల లోపు ఉన్న ఇద్దరు చిన్నపిల్లలు, ఇద్దరు యువకులు మరియు ఒక మహిళ ఉన్నారు.
ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. గ్రామంలో వీధి కుక్కలు ఎక్కువగా సంచరిస్తుండటంతో చిన్నపిల్లలు బయటకు వెళ్లడానికి భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో తిరుగుతున్న పిచ్చి కుక్కలను పట్టుకుని ప్రజల భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.




