11 March, 2026 | 2:28 AM

అంతర్జాతీయ విమానాశ్రయంగా ‘మధురై’

11-03-2026 12:37 AM
  1. పలు కీలక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్

ఆమోదం తెలిపిన కేంద్ర క్యాబినేట్ సమావేశం

న్యూఢిల్లీ, మార్చి 10: తమిళనాడులోని మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడానికి ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ తాజా సమావేశంలో పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే జల్ జీవన్ మిషన్ (జేజేఎం) అమలును మౌలిక సదుపాయాల కల్పన నుంచి సేవా పంపిణీ వరకు పునర్నిర్మించి, తిరిగి దిశానిర్దేశం చేయాలన్న జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను కేంద్ర కేబినేట్ సమావేశం ఆమోదించింది.

నిర్మాణాత్మక సంస్కరణలపై దృష్టి సారించి జేజేఎం పునర్నిర్మాణం కోసం, కేబినెట్ మొత్తం వ్యయాన్ని రూ. 8.69 లక్షల కోట్లకు పెంచడానికి ఆమోదం తెలిపింది, మొత్తం కేంద్ర సహాయం రూ. 3.59 లక్షల కోట్లు, 2019 ఆమోదించబడిన రూ. 2.08 లక్షల కోట్లు అంటే అదనపు కేంద్ర వాటా రూ. 1.51 లక్షల కోట్లు. అలాగే 2,905 కోట్లతో సంత్రాగచ్చి-ఖరగ్పూర్ 4 లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

1,569 కోట్లతో సైంథియా-పాకూర్ మధ్య నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం చెప్పింది. 3,839 కోట్లతో బద్నావర్-థాండియా - తిమర్వాని 5 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదం కూడా చెప్పింది. 3,631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే ఆరు లేన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.