11 March, 2026 | 3:59 AM

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా

11-03-2026 12:35 AM

తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన సహ వ్యవస్థాపకుడు రాహుల్ భాటియా  

న్యూఢిల్లీ, మార్చి 10: ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్న భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మంగళవారం రాజీనామా చేశారు. ఆయన స్థానంలో సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. గత డిసెంబర్‌లో సంస్థ ఎదుర్కొన్న తీవ్రమైన సంక్షోభం జరిగిన మూడు నెలలకే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. అయితే తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలని పీటర్ ఎల్బర్స్ పేర్కొన్నారు.ఈ మేరకు ఇండిగో సంస్థ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఎల్బర్స్ రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ‘వ్యక్తిగత కారణాల వల్ల సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నాను. నోటీస్ పీరియడ్‌ను మినహాయించాలని కోరుతున్నాను’ అని ఎల్బర్స్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఆయన రాజీనామాను ఇండిగో బోర్డు ఆమోదించింది. 2022 సెప్టెంబర్ నుంచి ఆయన అందించిన సేవలకు ధన్యవాదాలు తెలిపింది. కొత్త సీఈఓను నియమించే వరకు సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తారు.

గత ఏడాది డిసెంబర్లో ఇండిగో చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొం ది. భారీ సంఖ్యలో విమానాలు రద్దు కావ డం, గంటల తరబడి ఆలస్యమవ్వడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో ఒకే రోజు 300కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఈ వైఫల్యాలపై అప్పట్లో ఎల్బర్స్ స్వయంగా క్షమాపణలు చెప్పగా, డీజీసీఏ ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.