18 July, 2026 | 1:42 PM

బోనమో... మహంకాళిదేవి

18-07-2026 01:42 PM

- గంభీరావుపేటలో ఘనంగా మహంకాళి అమ్మవారి బోనాలు..

- బోనాలతో మహంకాళి ఆలయానికి వెళ్తున్న మహిళలు 

గంభీరావుపేట జులై 18 (విజయక్రాంతి): తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే ఆషాఢ మాస మహంకాళి అమ్మవారి బోనాల(Mahankali Ammavari Bonalu ) ఉత్సవాలు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో శనివారం గ్రామస్తులు మహంకాళి బోనాలను ఘనంగా నిర్వహించారు.మహిళలు నెత్తిన బోనాలు శివసత్తుల పూనకాలతో, బైండ్ల వారి ఆటపాటలు,డప్పు చప్పుల మధ్య ఆలయానికి ఊరేగింపుగా తరలి వెళ్లారు.

ఈ పండుగలో భాగంగా మహిళలు కొత్త కుండలలో వండిన అన్నం, బెల్లం, పాలు కలిపి నైవేద్యంగా (బోనం) సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పిల్ల జెల్లను చల్లంగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణంలో సంతరించుకున్నాయి.