ఆవు మెచ్చిన పులి కథ
ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది చానా మంచిది. ఆకలేసినప్పుడే జంతువులను చంపేది. కానీ చిన్న చిన్న జంతువులను అస్సలు ఏమనేది కాదు. పెద్ద పెద్ద జంతువులను, చెడ్డవాటినే వేటాడేది. మిగతా సమయాల్లో అన్నింటితో మంచిగా మాట్లాడేది. పలకరించేది. బాధల్లో ఉన్నప్పుడు ఆదుకునేది. దాంతో అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులంతా సంబరంగా పులి చుట్టూ తిరుగుతా, మాటలు కలుపుతూ సంతోషంగా ఉండేవి.
ఒకరోజు పులి ఆకలితో వేటకు బయలుదేరింది. పొ ద్దున్నుంచీ ఏవీ ఎదురుపడలేదు. “ఏమబ్బా.. ఈ రోజు ఒక్కటీ కనబడ్డం లేదు. అడవిలోని నక్కలు, తోడేళ్ళు ఏమైపోయాయి” అనుకుంటుంటే ఎదురుగా ఆవు కనబడింది. పులి అంతవరకు ఎప్పుడూ ఆవును చూడలేదు. అస లు ఆ అడవిలో ఆవులు ఎక్కడా లేవు. “ఇది చూసేందుకు బలంగా ఉంది. రెండు కొమ్ములు వున్నాయి. కానీ ముఖం అమాయకంగా ఉంది. ఇది మంచిదా, చెడ్డ దా... దీనిని చంపాలా వద్దా” అని ఆలోచించసాగింది.
అంతలో ఆవు పులిని చూసింది. కోరపళ్ళతో గంభీరం గా ఉంది. “ఇదేం జంతువబ్బా” అనుకుంటా చిరునవ్వుతో దగ్గరికి పోయి ”నా పేరు ఆవు. అడవి నాకు కొత్త. మనుషులతో కలసి ఉంటాను. శాకాహార జంతువును. గడ్డి, ఆకులు, పళ్లు తింటా ఉంటాను. నువ్వు ఎవరు” అనింది. పులికి ఆవు అమాయకురాలని తెలిసిపోయింది. “నా పేరు పులి. అడవి జంతువును. నేనంటే అడవిలో అందరికీ భయం. మాంసాహారం తిని బతుకుతాను” అని సమాధానమిచ్చింది. ఆ మాటలకు ఆవు బెదిరిపోయింది. పోయి పోయి దీని నోటికి చిక్కినట్టున్నానే అనుకోని పారిపోవడానికి వెనక్కి తిరిగింది. అంతలో పులి “ఆగు తల్లీ... నేను మిగతా పులుల లెక్క కాదు. చెడ్డ జంతువులనే వేటాడతాను. కానీ నీలాంటి అమాయకులను కాదు. ఏమీ భయపడవద్దు. ఇంతకూ నువ్వెందుకు ఇలా మా అడవిలోనికి వచ్చావు” అనింది.
ఆవు బాధతో తల వంచుకోని “ఈ అడవికి ఉత్తరం వైపున ఉన్నదే మా ఊరు. మా యజమాని రోజూ మా ఆవులను అడవి బైట ఉన్న మైదానానికి మేత మేయడానికి తోలుకోని పోతాడు. రోజూ అక్కడ మేం కడుపు నిండా తిని సాయంకాలం తిరిగి వెళ్ళిపోతాము. పొరపాటున గూడా ఎవరమూ అడవిలోకి అడుగుపెట్టం. నాకు ఒక చిన్న దూడ ఉంది. ఆరునెలల అమాయకురాలు. ముచ్చటగా ముద్దుపెట్టుకునేలా ఉంటది. అది ఆడుకుంటా ఆడుకుంటా పొరపాటున అడవిలోనికి వెళ్ళిపోయింది. నేను అది గమనించలేదు. సాయంకాలం అన్ని ఆవులూ, వాటి దూడలు వచ్చాయి. కానీ నా దూడ రాలేదు. దాంతో ఇక్కడికి వచ్చాను” అనింది. దాని కళ్ళలోంచి నీళ్ళ చుక్కలు కారి టపటపా కింద ఉన్న గడ్డి మీద పడ్డాయి.
ఆ మాటలకు పులి ”వింటా ఉంటే నాకే ఇంత బాధగా వుంటే కన్నతల్లివి నీకెంత బాధగా వుంటాదో గదా... అ మ్మా... పరవాలేదు ఇంకా నీ దూడ బతికే ఉంటే నేను తప్ప క కాపాడతా. ఈ అడవిలో ఎక్కడ ఏ పొద ఉందో, ఏ పొద లో ఏ జంతువు ఉందో, ఏ జంతువు గుణం ఎలాంటిదో, ఎప్పుడు ఎక్కడ తిరుగుతాదో అన్నీ నాకు తెలుసు. ముందు నీ దూడ ఎక్కడ తప్పిపోయిందో చూపించు. నేను వాసన పసిగట్టి అది అడవిలో ఎటువైపు ఎక్కడికి పోయిందో కనుక్కోని తెచ్చి నీ చేతిలో పెడతా” అని చెప్పింది.
రెండు వేగంగా ఆవులు మేత మేసే మైదానానికి చేరుకున్నాయి. పులి అక్కడంతా వాసన చూసుకుంటా ముందుకు పోతా అడవిలోనికి వచ్చింది. దానికి ఒకవైపు దూడ వాసన వచ్చింది. “నేను తిరిగి వచ్చేవరకు నీవు ఇక్కడే ఉండు. బతికుంటే ఖచ్చితంగా మీ ఇద్దరినీ కలుపుతా’ అంటా వెంటనే ఆ వాసన వెంబడి వేగంగా పరుగులు తీసింది. ఆ దారి అడవి నక్కలు బాగా తిరిగేచోటు. ఏ నక్క నోటికో అది చిక్కలేదు గదా” అని భయపడసాగింది.
అంతలో దానికి దూరంగా ”అంబా” అన్న అరుపు వినబడింది. పులి అదిరిపడి అది ఏదో ఆపదలో ఉందనుకుంటా విల్లు నుంచి వెలువడిన బాణంలా మెరుపు వేగంతో అటువైపు దూసుకుపోయింది. అక్కడ ఒక పెద్ద తోడేలు ఎదుట బిక్కు బిక్కుమంటా బెదురు చూపులతో వణికుతూ దూడ కనిపించింది. ఆ తోడేలు చానా చెడ్డది. కనబడిన జంతువునల్లా చంపి సంబరపడేది. చిన్న చిన్న జంతువులన్నీ దాని పేరు చెబితే చాలు భయంతో వణికిపోయేవి. పులి దాని కోసం చానా రోజుల నుంచి వెదుకులాడతా ఉంది. ఇప్పుడు కనబడింది. అంతే... పులి సంబరంగా ”ఈ దెబ్బతో నా ఆకలి తీరుతుంది. అడవికి పట్టిన శని వదులుతుంది. చిన్నదూడ తల్లి వద్దకు చేరుతుంది” అనుకుంటా ఎగిరి పంజాతో దాన్ని ఒకే ఒక్క పెరుకు పెరికింది. అంతే... ఆ దెబ్బకు అది ఎగిరిపడింది.
పులి ఆ చిన్నదూడను తీసుకొని దాని అమ్మ దగ్గరికి చేరింది. ఆవు సంతోషంగా దూడను కౌగిలించుకుంది. పులి దగ్గరికి పోయి కళ్ళనీళ్ళతో “నీ మేలు ఎప్పటికీ మరిచిపోలేను. నీవు కనబడకపోతే నా పిల్ల ఎప్పటికీ నా దగ్గరికి చేరేది కాదు. నువ్వే నాకు దేవుడివి” అనింది. పులి చిరునవ్వుతో దూడవైపు తిరిగి “పాపా... ఇంగెప్పుడూ ఇలా అడవిలోకి రాకు. అమ్మ మాట వింటా అమ్మ వెంబడే తిరుగు. సరేనా” అంటూ సంతోషంగా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది.
కామిడి సతీష్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి






