19 August, 2026 | 9:16 PM

మంథనికి మహర్దశ

23-05-2024 07:14 AM

మారనున్న రూపురేఖలు

అభివృద్ధిపై మంత్రి శ్రీధర్‌బాబు ఫోకస్

మంథని, మే22: మంథని పట్టణానికి మహర్దశ పట్టనుంది. నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గత ఎన్నికలకు ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు అడుగులు వేస్తున్నారు. మంథని గంగ గుళ్ల నుంచి గోదావరి నదిపై వంతెన నిర్మించాలని చాలా ఏళ్లుగా పట్టుదలతో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు దాదాపు రూ.125 కోట్లతో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిసింది. మంచిర్యాల జిల్లా జైపూరు మండలం శివ్వారంను కలుపుకొంటూ గోదావరి నదిపై ఈ వంతెన నిర్మాణం పూర్తయితే మంథని నుంచి చెన్నూరుకు కేవలం 20 కి.మీ దూరంతోనే చేరుకోవచ్చు.

అలాగే మంథని మండలం ఆరెంద వద్ద గోదావరి నదిపై మరో వంతెన నిర్మాణం, అటు కాటారం మండలం దామెరకుంటను కలుపుతూ వంతెన పూర్తవుతుంది. దీనితో మంథని నుంచి కాళేశ్వరానికి వెళ్లే దూరం కూడా తగ్గనుంది. మంథనిలోని 25 పడకల సర్కారు దవాఖానను 100 పడకల తీర్చిదిద్దడంపై దృష్టి సారించారు. అలాగే మంథని నుంచి పెద్దపల్లి వరకు, మంథని నుంచి భూపాలపల్లి జిల్లా కాటారం వరకు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కూడా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. వీటితో పాటు ముత్తారం నుంచి ఖమ్మంపల్లి మానేరు నది వరకు రూ.30 కోట్ల వ్యయంతో డబుల్ రోడ్డు కూడా మంజూరు చేయించారు.