19 August, 2026 | 8:25 PM

తాళం ‘పగలు’గొట్టి!

23-05-2024 07:15 AM

జగిత్యాల జిల్లాలో దొంగల హల్‌చల్

తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్!

పట్టపగలే ఇళ్లలోకి చొరబాటు

నగలు, నగదు అపహరణ

రాయికల్‌లో 40తులాలు దోపిడీ

పెగడపల్లిలో బంగారం, వెండి నగలు చోరీ 

జగిత్యాల, మే 22 (విజయ క్రాంతి ) :  ఇల్లు విడిచి ఒక్క పూట ఎటైనా వెళ్లాలంటే జగిత్యాల జిల్లా జనం జంకుతున్నారు. తాళం వేసి తానానికి వెళ్లినా ఇల్లు భద్రంగా ఉంటుందా అనే అనుమానాల మధ్య హడలెత్తిపోతున్నారు. ఇటీవల జగిత్యాల జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్‌గా దొంగతనాలు జరుగుతున్నాయి. పట్టపగలే ఇళ్లల్లోకి చొరబడుతూ పోలీసులకే సవాల్‌గా మారారు. జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.  జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో, పెగడపల్లిలో మంగళవారం జరిగిన దొంగతనాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

రాయికల్ పట్టణంలో విజయలక్ష్మీ తన ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దుండగులు పట్టపగలే తాళం పగలగొట్టారు.  బీరువాలో ఉన్న 40 తులాల బంగారు నగలు, ఒక లక్ష నగదు ఎత్తుకెళ్లారు.  ఇదిలా ఉండగా, పెగడపల్లి బస్టాండ్ సమీపంలో ఆరె దశరథం, మహేందర్ పొద్దున పదింటికి ఇళ్లకు తాళాలు వేసి గుడికి వెళ్లారు. ఆ తాళం దొంగల కంట ఎలా పడిందోగానీ, గుడి నుంచి తిరిగొచ్చేసరికి  తాళాలు పగిలాయి. 2 తులాల బంగారం, వెండి నగలు, రూ.1.56లక్షల నగదు మాయమయ్యాయి.

ఈ రెండు సంఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు జగిత్యాల డిఎస్పీ రఘు చందర్, టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్‌ఐ అజయ్,  మల్యాల సిఐ, పెగడపల్లి ఎస్సై కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా, పట్టపగలే తాళాలు పగలగొట్టి దొంగలు చేతివాటం ప్రదర్శించడం పట్ల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పట్టపగలే తెగబడుతున్నారంటే రాత్రి పూట పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుని ప్రజలకు దొంగల బెడద నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.