29 March, 2026 | 2:37 AM

31న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మహావీర్ జయంతి

29-03-2026 12:50 AM

ముషీరాబాద్, మార్చి 28 (విజయక్రాంతి): జైన మతంలోని శ్వేతాంబర, దిగం బరలకు అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన భగవాన్ మహావీరుని 2625వ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘మహావీర్ జయంతి’ని మార్చి 31న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ జైన్ సేవా సంఘ్ మార్గదర్శక మండల్ చైర్మన్ యోగేష్ కుమార్ సింగి తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ బ్రోచర్ ను శ్రీ జైన్ సేవా సంఘ్ అధ్యక్షులు ఉమేష్ బాజీరెచ్ఛ తోకలసి ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడు తూ ’జీవించు-జీవించనివ్వు’ అనే నినాదంతో మార్చి 31 న ఉదయం 8:30 గంటలకు ఫీల్ఖానాలో ఉన్న జైన మందిరం నుండి వేలాది మంది భక్తులతో భారీ శోభాయాత్ర మొజంజాహి మార్కెట్ మీదుగా సాగి, ఉదయం 10:30 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌం డ్‌కు చేరుకుంటుందని చెప్పారు. ఈ సందర్బంగా ఉచిత ఆరోగ్య పరీక్షలు, ఉచిత మాగ్నెట్, ఆక్యుప్రెషర్ శిబిరాలు, రక్తదాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

ముఖ్య అతిధిగా సీఎం రేవంత్ రెడ్డి, గౌరవ అతిధులుగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మైనార్టీ కమిషన్ సభ్యులు హిమాన్షు బాప్నా, విశ్వ హిందూ పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు హుకుంచంద్జీ సావ్లా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ్ ప్రతినిధులు కైలాష్ భండారి, వినోద్ ముఖాన, విమల్ ముథ, సురేష్ సూరన, యోగేష్ సోని, సునీల్ కావడియా, దిలీప్ భండారి, దిలీప్ షెటియా, అశోక్ ముథ, మనోజ్ టాటెడ్, రాకేష్ సూరన, మహావీర్ టాటెడ్ లా పాల్గొన్నారు.