8 May, 2026 | 2:17 AM

మెజార్టీ మెలిక

08-05-2026 01:34 AM

తమిళనాడులో అదే అనిశ్చితి

  1. రెండోసారి లోక్‌భవన్‌కు టీవీకే అధినేత విజయ్
  2. స్పష్టమైన మెజార్టీ లేదంటూ ప్రభుత్వ ఏర్పాటుకు నో అన్న గవర్నర్ 
  3. టీవీకేకు మద్దతుపై సీపీఐ, వీసీకే నేడు నిర్ణయం 
  4. ఏఎంఎంకే మద్దతు కోరిన విజయ్ 
  5. ‘ఇండియా’ కూటమికి డీఎంకే గుడ్‌బై

చెన్నై, మే ౭: తమిళనాడు రాజకీయా ల్లో అదే అనిశ్చితి కొనసాగుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హంగ్‌కు దారితీయడంతో రాజకీయాలు రోజుకో మలు పు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గురువారం టీవీకే అధినేత విజయ్ తన బృందంతో కలిసి గవ ర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌ను కలిసి 113 మంది ఎమ్మెల్యేల (టీవీకే 108 మంది ఎమ్మెల్యేలు + కాంగ్రెస్ ఐదుగురు ఎమ్మెల్యేలు) మద్దతు లేఖలను సమర్పించగా, స్పష్టమైన మెజార్టీ లేదని గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకరించలేదు.

మ్యాజిక్ ఫిగర్‌కు కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల మద్దతుతో రావాలని.. ఈ లోగా మరో పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు తను అహ్వానించనని గవర్నర్ హామీ ఇచ్చిన ట్టు తెలిసింది. అయితే.. బుధవారం గవర్నర్ స్వయంగా విజయ్‌ని ఆహ్వానించడంతో ఆయన లోక్‌భవన్‌కు వెళ్లారు. గురువారం భేటీకి సంబంధించిన అంశంపై లోక్‌భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేదని గవర్నర్ ఆ ప్రకటనలో పేర్కొ న్నారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ఖచ్చితంగా మెజార్టీ నిరూపించుకోవాలని స్పష్టం చేశా రు. అంతేకాదు.. మద్దతు ఇస్తున్నట్లు పేర్కొ న్న ఇతర పార్టీల నుంచి కూడా అధికారిక సమాచారం రావాలని, రాజ్యాంగ నిపుణులతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసు కుంటానని తేల్చిచెప్పారు. మేజిక్ ఫిగర్ 118 కి ఇంకా 5 సీట్ల దూరంలో ఉండటంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

అత్యధిక స్థానాలు గెలుచు కున్న ఏకైక పెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలనే సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నా యి. ప్రజల మద్దతు పొందిన పార్టీని ఇంకా ప్రభుత్వ ఏర్పాటుకు ఎదురుచూసేలా చేయ డం రాజ్యాంగ నియమాలకు విరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్ వైఖరి నిరసిస్తూ టీవీకే కార్యకర్తలు లోక్‌భవన్ ఎదుట ఆందోళన చేశారు. 

ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి..

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు విజయ్‌కు అనుమతి ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉన్న వీసీకే డిమాండ్ చేసింది. టీవీకేకు మద్దతు ఇచ్చే అంశంలో శుక్రవారం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది. ఇద్దరు ఎమ్మెల్యేల బలం ఉన్న సీపీఐ కూడా టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరింది. తన నిర్ణయాన్ని కూడా శుక్రవారం తెలుపుతామని ప్రకటించింది. విజయ్‌కే తొలుత అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాన్ని డీఎంకే కూడా వ్యక్తం చేయడం గమనార్హం. మరోవైపు, సంఖ్యాబలం కోసం ఒకే ఒక ఎమ్మెల్యే బలం ఉన్న ఏఎంఎంకేను కూడా మద్దతు కోరినట్లు తెలిసింది.

అన్నాడీఎంకే ప్రతిపాదనకు డీఎంకే.. నో!

ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ అన్నాఏడీఎంకే పంపిన ప్రతిపాదనను డీఎంకే నాయకత్వం నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రజాతీర్పును గౌరవిస్తూ తాము ప్రతిపక్షంలో ఉంటామని స్పష్టం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా వెళ్లడం తమకు ఇష్టం లేదని కుండబద్దలు కొట్టింది. ఒకవేళ వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంటే తాము అడ్డుకోబోమని కూడా తేల్చిచెప్పింది.

రిసార్ట్‌కు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు

ఎన్నికల ఫలితాలు విడులైన తర్వాత అన్నాడీఎంకే అధిష్ఠానం తమ పార్టీ నుంచి గెలిచిన 27 మంది కొత్త ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని ఒక రిసార్టుకు తరలించింది. టీవీకే తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే అవకాశం ఉందన్న అనుమానంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో అన్నాఏడీ ఎంకేలో కీలక నేతగా కొనసాగి, ఇటీవల టీవీకేలో చేరిన కేఏ సెంగొట్టయన్ కొత్త ఎమ్మె ల్యేలతో బేరసారాలు సాగిస్తున్నారనే ప్రచారం రాష్ట్రంలో జోరుగా సాగుతున్నది.

బలమైన ప్రతిపక్షంగా..: స్టాలిన్

డీఎంకే అధినేత, మాజీ సీఎం స్టాలిన్ గురువారం చెన్నైలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మె  ల్యేలందరికీ స్టాలిన్ కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డీఎంకే బలమైన ప్రతిపక్ష పార్టీగా పనిచేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని తేల్చిచెప్పారు. దీనిలో భాగంగానే ఆయన అన్నాడీఎంకేతో పొత్తు అంశాన్నీ కొట్టిపడేశారు.

పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులంతా ఈనెల 10 వరకు చెన్నైలోనే ఉండాలని హు కుం జారీ చేశారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఆరు నెలల వరకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా గమనిస్తూ ఉంటామని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం డీఎంకే హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాల్సి ఉంటుందని కూడా ముక్తాయించారు.

నేడు లోక్‌భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు..

గవర్నర్ నిర్ణయాన్ని నిరసిస్తూ తమిళనాడు కాంగ్రెస్ కమిటీ శుక్రవారం లోక్‌భ వన్ ముట్టడికి పిలుపునిచ్చింది. కాంగ్రెస్ శ్రేణులు ఉదయం ప్రదర్శనగా వెళ్లి గవర్నర్ అధికారిక నివాసాన్ని ముట్టడించాలని సూ చించింది. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లాకేంద్రాలు, మండల కేంద్రాల్లోనూ పెద్దఎ త్తున ధర్నాలు నిర్వహించాలని పిలుపుని చ్చింది. కాంగ్రెస్ పిలుపుతో అక్కడి పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. చెన్నైతోపాటు అన్ని జిల్లాకేంద్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు సీపీఎం, సీపీఐ కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

తెరపైకి 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు..

స్పష్టమైన మెజార్టీ విషయంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. గతంలో మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీ అధినేతతో ప్రమాణ స్వీకారం చేయించి, ఆ తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించిన సందర్భాలు ఉన్నాయి. 1994 నాటి ఎస్‌ఆర్ బొమ్ము కేసులో సుప్రీంకోర్టు ‘మెజారిటీ అనేది అసెంబ్లీ వేదికగానే తేలాలే తప్ప, రాజ్‌భవన్‌లో కాదు’ అని తీర్పునిచ్చింది. 

ఇండియా కూటమికి డీఎంకే గుడ్‌బై..

డీఎంకే తన చిరకాల మిత్రపక్షం కాంగ్రెస్‌తో గురువారం తెగదెంపులు చేసుకుంది. కాంగ్రెస్ వైఖరిని ఖండిస్తూ పార్టీ తరఫున తీర్మానాలను ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ పాత పద్ధతి మార్చుకోలేదని, పాత అలవాటు ప్రకారమే తమకు వెన్నుపోటు పొడిచిందని మండిపడింది. ఇండియా కూటమి కథ ముగిసిందంటూ సంచలన ప్రకటన విడుదల చేసింది.

ఇతర రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల పట్ల బీజేపీ ఎలాంటి వివక్ష చూపించిందో, తమిళనాడులో కాంగ్రెస్ కూడా అలాగే చేసిందని ఆరోపించింది. ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదని, ఇలాంటి అనిశ్చితి సమయంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏర్పడే పరిణామాలను ఎదుర్కొనేందకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించింది.