బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తేనే సముచిత స్థానం
అధికారులతో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): అధికారులు ఎవరి బాధ్యతలను వారు సమర్థవంతంగా నిర్వహిస్తేనే సముచిత స్థానం ఉంటుందని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. గురువారం తహసీల్దార్లతో నిర్వహించిన వెబెక్స్ సమీక్షలో అన్ని మండలాల తహసీల్దార్లతో అక్రమ ఇసుక తవ్వకాలపై, భూభారతి, సదాబైనమా, మీసేవ, ప్రజాపాలన, కుటుంబ రిజిస్ట్రేషన్ దరఖాస్తుల పై, ఆగస్టు 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను అరికట్టేందుకు తహసీల్దార్లు అప్రమత్తంగా వ్యవహరించి, సమాచారం అందిన వెంటనే క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ముఖ్యంగా కోయిల్‌కొండ, మూసాపేట, మిడ్జిల్, దేవరకద్ర, చిన్నచింతకుంట, జడ్చర్ల తదితర మండలాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుపై వచ్చిన ఫిర్యాదులు, నివేదికలను కలెక్టర్ సమీక్షించారు. కోయిల్‌కొండ మండలం శివారం గ్రామంలో ఇసుక తవ్వకాల కారణంగా ప్రభుత్వ భూమికి నష్టం జరిగినట్లు వచ్చిన నివేదికపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ తవ్వకాలు గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. ప్రతి శాఖ పరిధిలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేస్తూ పురోగతి సాధించాలని ఆదేశించారు. కుటుంబ రిజిస్ట్రేషన్లకు సంబంధించి దరఖాస్తు లను కూడా వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఐతే చనిపోయిన వారి వివరణను జాగ్రత్తగా పరిశీలించి కుటుంబ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలను జారీ చేయాలని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. ఎల్. బి హరిప్రియ, డి. ఆర్.ఓ ఎ.నిర్మల, ఆర్. డి.ఓ నవీన్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏ. డి అశోక్, జిల్లా మైనింగ్ శాఖ అధికారులు, మండల తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.






