ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలి
సీఎంఆర్ బియ్యం అందించాల్సిందే
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి) : జిల్లాలో రబీ 2024–25 సీజన్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సిఎంఆర్ డెలివరీ ఆగస్టు 31 లోగా పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె ఎల్ బి హరిప్రియ మిల్లర్ లను ఆదేశించారు. రబీ 2024-25 సి. ఎం.ఆర్ పెండింగ్ డెలివరీ పై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జె .ఎల్.బి.హరిప్రియ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో తన ఛాంబర్ లో రైస్ మిల్లర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు 95 శాతం సీఎంఆర్ డెలివరీ పూర్తయిందని, మిగిలిన 5 శాతం సీఎంఆర్ డెలివరీ 9 మంది బాయిల్డ్ రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్‌లో ఉందని అధికారులు సమావేశంలో వివరించారు. రబీ 2024–25 సీజన్‌కు భారత ప్రభుత్వం ఆగస్టు 31 వరకు గడువు పొడిగించినందున, మిగిలిన గడువులో మిల్లర్లు తమ మిల్లింగ్ సామర్థ్యానికి అనుగుణంగా రోజుకు రెండు షిఫ్టుల్లో మిల్లింగ్ నిర్వహించి, పెండింగ్ సీఎంఆర్‌ను గడువు లోపు పూర్తిగా డెలివరీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
పెండింగ్ సీఎంఆర్‌ను పూర్తి చేయడానికి బాయిల్డ్ రైస్‌కు బదులుగా రా రైస్ టార్గెట్ ఇస్తే గడువులోపు సీఎంఆర్ డెలివరీ పూర్తి చేస్తామని కొంతమంది మిల్లర్లు సమావేశంలో కోరారు. అయితే, మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రస్తుతం రా రైస్ టార్గెట్ మాత్రమే కేటాయించబడిందని, బాయిల్డ్ రైస్ టార్గెట్ కేటాయించే అవకాశం లేదని కమిషనర్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని అధికారులు మిల్లర్లకు తెలియజేశారు. పెండింగ్ సీఎంఆర్ డెలివరీలో ఎటువంటి జాప్యం చేయకుండా, నిర్దేశిత గడువు ఆగస్టు 31 లోపు మొత్తం సీఎంఆర్‌ను డెలివరీ చేసి డిఫాల్ట్ కాకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ మిల్లర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్,జిల్లా పౌర సరఫరాల సంస్థ డి. ఎం.రవి నాయక్, సంబంధిత రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.






