మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఈ నెల 20న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ కోరారు. రాజీ పడదగిన వివిధ రకాల కేసులను పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఒక ఉత్తమ వేదికగా నిలుస్తుందని బుధవారం ప్రకటన తెలిపారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన వివాదాలు, కుటుంబ, వైవాహిక సమస్యలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు తదితర అంశాల్లో ఇరువర్గాలు పరస్పర రాజీ ద్వారా వివాదాలను పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్న చిన్న వివాదాలను పెద్ద కక్షలుగా మార్చుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకోవద్దని సూచించారు.
"రాజీయే రాజమార్గం" అనే భావనతో న్యాయశాఖ కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకుని తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందాలని కోరారు. జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి సంబంధిత ఇరువర్గాలతో కౌన్సిలింగ్ నిర్వహించి అవగాహన కల్పిస్తారని తెలిపారు. రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలనుకునే వారు సంబంధిత పోలీసు అధికారులను సంప్రదించాలని సూచించారు.లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని, స్నేహపూర్వక వాతావరణంలో వివాదాలను ముగించుకునేందుకు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి చేశారు.






