గోదావరి పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేయండి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాచలం, మే 14,(విజయక్రాంతి): భద్రాచలంలో జరిగే గోదావరి పుష్కరాలకు దేశ విదేశాల నుండి వచ్చే భక్తులుగోదావరి నదిలో స్నానం ఆచరించి శ్రీ సీతారామచంద్ర స్వామి దర్శనం చేసుకొని వారి గమ్యస్థానాలకు వెళుతుంటారని, భక్తులు రాక అనుగుణంగా పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ జౌళి శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులకు ఆదేశించారు.
గురువారం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం వసతి గృహములో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదేం వీరయ్య,ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, సర్పంచ్ పూణేం కృష్ణ ఇతర శాఖల అధికారులతో కలిసి రాబోయే గోదావరి పుష్కరాలకు చేపట్టవలసిన కార్యాచరణ గురించి ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు కొన్ని సూచనలు ఇస్తూ గోదావరి పుష్కరాలు దగ్గర పడుతున్నందున ప్రతి శాఖ అధికారి భద్రాచలం అభివృద్ధికి పాటుపడాలని, భద్రాచలం పట్టణంతో పాటు పరిసరాలు మరియు వార్డులు సర్వ సుందరంగా ఉండేలా చూడాలని, శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జూన్ జూలై మాసాలలో కరకట్ట ప్రదేశాలలో నర్సరీ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, అలాగే రోడ్లు, లైట్లు విద్యుత్ సౌకర్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
శానిటేషన్ పరంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటింటికి తిరిగి సేకరించిన తడి చెత్త పొడి చెత్త డంపింగ్ యార్డ్ కి తరలించిన తర్వాత ఎరువుల తయారీతో పాటు గ్యాస్ ఉత్పత్తి కూడా చేయవచ్చని అందుకు తగ్గట్టు ప్రణాళికలు సిద్ధం చేసుకుని సమర్పించాలని అన్నారు. చెత్తను రోడ్డుమీద వేస్తే జరిమానా విధించేలా చర్యలు తీసుకోవాలని ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.
ముఖ్యంగా ఐటీడీఏ పీవో, సబ్ కలెక్టర్, దేవస్థానం ఈవో, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఫారెస్ట్, టూరిజం అధికారులు త్వరలో సమావేశం నిర్వహించుకొని గోదావరి పుష్కరాలకు కావలసిన ఏర్పాట్లు మరియు కార్యాచరణ గురించి ప్రతిపాదనలు తయారుచేసి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పంపించాలని అన్నారు. ఇప్పటినుండే సంబంధిత అధికారులు గోదావరి పుష్కరాల ఏర్పాట్ల గురించి ప్రణాళికలు రూపొందించుకొని బాధ్యతగా పనులు ప్రారంభించి త్వరితగతిన ముగించి గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులతో పాటు భద్రాచలం పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
ఇరిగేషన్ శాఖ అధికారులు గోదావరి వరద ముంపునకు గురి అయ్యే గ్రామాలను దృష్టిలో పెట్టుకొని షట్టర్ల రిపేరు చేయించుకోవాలని, జనరేటర్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి సి నాగేశ్వరరావు, వ్యవసాయ అధికారి నవీన్ కుమార్, ఇరిగేషన్ డి ఈ వెంకటేశ్వర్లు, తాసిల్దార్ ధన్యాల వెంకటేశ్వర్లు, జిపి ఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






