18 March, 2026 | 3:36 PM

ప్రజాసేవలో విశ్రాంతి, విరమణ ఉండదు

18-03-2026 01:42 PM

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) బుధవారం నాడు పదవీ విరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు పలికారు. ఎంపీలుగా పదవీవిరమణ చేయవచ్చు.. ప్రజాసేవలో విరమణ ఉండదని ఖర్గే తెలిపారు. సభనుంచి వెళ్లిపోయినంత మాత్రాన వారి సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉండదన్నారు. ఈ సభకు నిరంతరం కొత్తవారు వస్తుంటారు.. పాతవారు వెళ్తుంటారని చెప్పారు.

సమస్యలపై చర్చించిన తీరును ఎప్పటికీ ఈ సభ గుర్తుంచుకుంటుందన్నారు. అలాగే సభలో కార్యకలాపాల నిర్వహణకు సంబంధించిన నియమ నిబంధనలను సమీక్షించాలని సూచించారు. ప్రజా ప్రాముఖ్యత కలిగిన అంశాలను అత్యంత గంభీరంగా చర్చించేందుకు వీలుగా, సభ మరిన్ని సమావేశాలు నిర్వహించాలని కూడా ఆయన అన్నారు. చట్టాల రూపకల్పనలో ప్రతిపక్ష సభ్యుల భాగస్వామ్యం మరింత ఎక్కువగా ఉండాలని ఖర్గే పిలుపునిచ్చారు. దీనికి ఏ అడ్డంకి కలిగినా, అది పార్లమెంటు వ్యవస్థను బలహీనపరుస్తుందని ఖర్గే పేర్కొన్నారు.