అభివృద్ధికి ఆమడదూరంలో మామిడిగుట్టతండా
- శిథిలమైన రహదారులు.. చీకట్లో రాకపోకలు
- సమస్యలు చెప్పినా పట్టించుకోని అధికారులు.. తండావాసుల ఆవేదన
బాలానగర్, ఆగస్టు 28 : మండలంలోని ఉడిత్యాల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మామిడిగుట్టతండా కనీస మౌలిక వసతులకు నోచుకోక సమస్యలతో సతమతమవుతోంది. రహదారులు శిథిలావస్థకు చేరడంతో పాటు వీధిలైట్లు వెలగక తండావాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తండా వెనుక భాగంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారి పూర్తిగా దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షం కురిసినప్పుడు గుంతల్లో నీరు నిలిచి రహదారి మరింత ప్రమాదకరంగా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇక 12వ వార్డులో వీధిలైట్లు వెలగక రాత్రివేళ తండా మొత్తం చీకటిమయంగా మారుతోంది. దీంతో మహిళలు, వృద్ధులు, చిన్నారులు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు విన్నవించిన స్పందన కరువు..
సమస్యలను పరిష్కరించాలని గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు విన్నవించినా ఇప్పటివరకు సరైన స్పందన లేదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి శిథిలమైన రహదారికి మరమ్మతులు చేపట్టడంతో పాటు వీధిలైట్లు ఏర్పాటు చేసి తండా సమస్యలను పరిష్కరించాలని మామిడిగుట్టతండా ప్రజలు కోరుతున్నారు.






