29 August, 2026 | 9:34 PM

సీఎం పెద్ద మనసు

29-08-2026 02:04 AM
  1. రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
  2. మంత్రి సీతక్కతో కలిసి సీఎం ఇంటికి
  3. ముఖ్యమంత్రి ఆత్మీయ ఆహ్వానం
  4. సురేఖ కూతురు సుష్మిత వ్యాఖ్యల వేళ కీలక భేటీ 

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి) : రాఖీ పౌర్ణమి వేళ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల రాజకీయంగా చర్చకు దారితీసిన మంత్రి కొండా సురేఖ.. మంత్రి సీతక్కతో కలిసి సీఎం ఇంటికి వెళ్లి రాఖీ కట్టారు. ఇద్దరు మంత్రులను సీఎం ఆత్మీయంగా ఆహ్వానించి, ఆశీస్సులు అందజేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి, ఇద్దరు మంత్రులు పరస్పరం స్వీట్లు తినిపించుకుని రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖలు పార్టీలో చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారాన్ని అధిష్ఠానం కూడా సీరియస్‌గా తీసుకోవడం.. సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పిస్తారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి సీతక్కతో కలిసి కొండా సురేఖ ఒకే కారులో సీఎం ఇంటికి రావడం, రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం మనువడు, అల్లుడికి కూడా  రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

సీఎం నివాసంలో సురేఖ కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరి భేటీ ఎలా ఉంటుందన్న ఆసక్తి కాంగ్రెస్ వర్గాల్లో నెలకొన్నప్పటికీ.. అందుకు భిన్నంగా ఇద్దరు మంత్రులను సీఎం సాదరంగా ఆహ్వానించి, రాఖీ కట్టించుకోవడం చర్చనీయాంశమైంది.

సీఎం వ్యవహరించిన తీరు ఆయన పెద్ద మనసుకు నిదర్శనమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టిన వారిలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయల, సభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బ్రహ్మకుమారీలు, మహిళా కాంగ్రెస్ నాయకులు, మలక్‌పేట్‌లోని గవర్నమెంట్ హైస్కూల్ ఫర్ ది బ్లైండ్ విద్యార్థినులు ఉన్నారు. 

సీఎంకు ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటుంది : మంత్రి కొండా సురేఖ 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడారు. ‘పండుగ వాతావరణంలో ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయను. నేను అందరికీ సోదరీమణినే. తెలంగాణలోని ప్రతి కుటుంబం నన్ను వారి కుటుంబ సభ్యురాలిగానే ఆదరిస్తున్నారు’

అని మంత్రి పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి రాష్ట్రంలోని మహిళల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని.. సీఎం ఆశీర్వాదాలు కూడా తెలంగాణలోని అడపడుచులపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. గత మూడేళ్లుగా ప్రతిసారి సీఎం రేవంత్‌రెడ్డికి రాఖీ కడుతున్నట్లే.. ఈసారి కూడా రాఖీ కట్టానని చెప్పారు.  

సీఎం రేవంత్ వల్లే ఈ స్థాయికి : మంత్రి సీతక్క 

ఆదివాసీ బిడ్డనైన తనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సోదరిగా భావిస్తూ ఈ స్థాయికి రావడానికి కారకులు అయ్యారని మంత్రి  సీతక్క అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా 12 సంవత్సరాలుగా రేవంత్‌రెడ్డిని తన సొంత సోదరుడిగా భావిస్తూ రాఖీ కడుతున్నానని పేర్కొన్నారు. ములుగు ప్రజల ఆశీస్సులు దీవెనలతో నా జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తున్నానని, తాను ఇంతటి స్థాయికి తీసుకొచ్చిన ములుగు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని మంత్రి తెలిపారు.