calender_icon.png 3 February, 2026 | 10:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారులో లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై దుండగుడి దాడి

03-02-2026 08:59:33 PM

సెల్‌ఫోన్, నగదు లాక్కునేందుకు యత్నం

తీవ్ర గాయాల మధ్య  ధైర్యంగా ప్రతిఘటించిన బాధితుడు

చిట్యాల,(విజయక్రాంతి): లిఫ్ట్ అడిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకున్న వ్యక్తిపై దుండగుడు కత్తితో దాడి చేసి మానవత్వాన్ని దుర్వినియోగం చేసిన దారుణ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రం నుంచి వ్యక్తిగత పనుల నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరిన ఇమ్రాన్ అనే వ్యక్తి, మార్గమధ్యలో నార్కెట్‌పల్లి వద్ద లిఫ్ట్ అడిగిన ఓ గుర్తుతెలియని వ్యక్తిని మానవతా దృక్పథంతో కారులో ఎక్కించుకున్నాడు.

అయితే చిట్యాల సమీపానికి చేరుకోగానే, ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఇమ్రాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఇమ్రాన్ మెడతో పాటు శరీరంపై విచక్షణ లేకుండా కత్తిపోట్లకు పాల్పడి, అతని సెల్‌ఫోన్ మరియు నగదు లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించగా, తీవ్ర గాయాల మధ్య కూడా ఇమ్రాన్ ధైర్యంగా ప్రతిఘటించడంతో, భయాందోళనకు గురైన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న ఇమ్రాన్‌ను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అతడిని తక్షణమే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ప్రాథమిక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. హైవేలపై లిఫ్ట్ ఇచ్చే విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.