ఎంజీ పార్క్.. నాణ్యతపై బిగ్ క్వశ్చన్..?
రూ.కోటి ఖర్చు చేసినా.. వర్షానికే నీటమునిగిన వాకింగ్ ట్రాక్
మణికొండ, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): ఎంజీ పార్క్(MG Park) అభివృద్ధి పనుల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కు సుందరీకరణ కోసం సుమారు రూ.కోటి ఖర్చు చేసినప్పటికీ, కొద్దిపాటి వర్షానికే వాకింగ్ ట్రాక్‌పై నీరు నిలిచిపోవడంతో నడిచేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
ప్రజాధనంతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో కనీసం డ్రైనేజీ, వర్షపు నీటి నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్కుకు వచ్చే వాకర్స్, వృద్ధులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.
సుందరీకరణ పేరుతో భారీగా నిధులు ఖర్చు చేసినా, వర్షపు నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు పార్కును పరిశీలించి, నీరు నిలిచిపోవడానికి గల కారణాలను గుర్తించి, వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
ప్రజాధనంతో చేపట్టే అభివృద్ధి పనులు నాణ్యతతో, దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని, అధికారుల పర్యవేక్షణతో పాటు పార్కు నిర్వహణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.