27 March, 2026 | 6:08 PM

మావోయిస్టు విముక్త భారత్

19-10-2025 12:52 AM

-త్వరలోనే అది నిజం చేస్తాం..

-ఒకప్పుడు 125 జిల్లాల్లో.. ఇప్పుడు 11 జిల్లాలకే పరిమితం

-మూడు రోజుల్లో 303 మంది లొంగుబాటు

-ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ‘కేవలం 75 గంట ల్లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర పోలీసుల ఎదుట 303 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో గురువారం ఒక్కరోజే ఛత్తీస్‌గఢ్‌లో ఆయుధాలు అప్పగించి 170 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇది మా వోయిస్టుపార్టీకి తిరుగులేని దెబ్బ. పదేళ్ల క్రితం దేశవ్యాప్తంగా 125 జిల్లాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండేది. ఇప్పుడా సంఖ్య 11కు పడిపోయింది. లొంగిపోయిన వారిలో పార్టీ అగ్రనేతలు ఉన్నారు. వారి తలలపై రూ.కోట్లు, రూ.లక్షల రివార్డులు ఉన్నాయి.

యూపీఏ ప్రభుత్వం తీవ్రవాదం, ఉగ్రవాదం గురించి పట్టించుకోలేదు. ఎన్డీ యే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త ఆ రెండింటిపై ఉక్కుపాదం మోపాం. త్వరలోనే భారత్ మావోయిస్టు విముక్త దేశమవు తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగి న ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2025లో ఆయన ప్రసంగించారు. ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు అశన్న అలియాస్ రూపేశ్ అలియాస్ తక్కెళపల్లి వాసుదేవరావు 200 మందికి పైగా పార్టీ సభ్యులతో లొంగిపోవడం కేంద్ర ప్రభుత్వ నైతికవిజయమని అభి వర్ణించారు.

యూపీఏ హయాంలో అర్బన్ నక్సల్స్ వ్యవస్థ చాలా బలంగా ఉండేదని, సమాజంలో మేధావులు, సామాజిక కార్యకర్తల ముసుగులో ఉంటూ వారు మావోయిస్టులకు సహాయ, సహకారాలు అందించేవా రని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక వారి ఆగడాలకు అడ్డుకట్ట వేశామని వివరించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి లభించిందని, ఈ దీపావళి ఆయా ప్రాంతాల ప్రజ లకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. ఒకప్పుడు బస్తర్ పేరిట బాంబ్ బ్లాస్టింగ్స్, జవా న్ల హత్య, వాహనాల దహనం వంటి వార్త లు చూసేవాళ్లమని, ఇక ఆ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని ఆకాం క్షించారు.

భారతేశం త్వరలోనే వందశాతం మావోయిస్టు విముక్తి దేశం కాబోతున్నదని, ఆ రోజు ఇక ఎంతోదూరంలో లేదని చెప్పుకొచ్చారు. మావోయిస్టు పార్టీ దశాబ్దాలుగా సాగించిన హింసాత్మక, విధ్వంసక చర్యల వల్ల వేలాది మంది ప్రజలు కన్నుమూశారని వాపోయారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కనీసం స్కూళ్లు, ఆసుపత్రులు సైతం నిర్మించేందుకు వీలుండేది కాదని వివరించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులను అడుగుపెట్టనీయలేదని వెల్లడించారు. మావోయిస్టు పార్టీ ఆదివాసీలకు మౌలిక వసతులను దూరం చేసిందని ఆరోపించారు.

యువతను తమ బాటలోకి తెచ్చుకుని వారి భవిష్యత్తును అంధాకరం చేసిందని మండిపడ్డారు. మావోయిస్టుపార్టీ వేధింపులు, దాడులకు తాళలేని ఎంతోమంది బాధితులు ఇటీవల ఢిల్లీకి వచ్చి తమకు మొరపెట్టుకున్నారని గుర్తుచేశారు. సమ్మిట్‌కు శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్య, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునక్ తదితరులు హాజరయ్యారు.