త్వరలో హైడ్రాకు కొత్త చట్టం
- ప్రభుత్వ ఆస్తుల జోలికి వస్తే.. హైడ్రా బుల్డోజర్లు దిగుతాయి
- కబ్జాలకు పాల్పడినవారికే మాతో ముప్పు
- అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించిన ప్రభుత్వ అధికారులకు త్వరలోనే నోటీసులు
- కింగ్ నాగార్జున సినిమాలు అంటే ఇష్టం
‘విజయక్రాంతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 28 (విజయక్రాంతి): అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో భూ ఆక్ర మణలను ఉపేక్షించేది లేదు. మల్టీనేషనల్ కంపెనీలు పెట్టుబడుల కోసం హైదరాబాద్ నగరానికి క్యూ కడుతున్నాయి. మరోవైపు నగరంలో చిన్న వర్షానికే రహదారులు, కాలనీలు నీట మునుగుతున్నాయి.
దీనికి ప్రధాన కారణం చెరువులు, నాలాలు కబ్జాలకు గురికావడమే. చెరువులు, నాలాలు, ఇతర ప్రభుత్వ ఆస్తులను ఆక్రమణల నుంచి సంరక్షించాలనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ను ఏర్పాటు చేసింది. జీవో| ప్రకారం చెరువులు, కుంటలు, నాలాలతో పాటు ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణలను ఉపేక్షించేది లేదు.
రాజకీయ నాయకులైనా, సినీ నటులైనా ప్రభుత్వ ఆస్తుల జోలికి వస్తే హైడ్రా బుల్డోజర్లు పరుగెత్తుకొస్తాయి. ముందుగా బలవంతులను కొడితేనే మిగతా ప్రజలకు నమ్మకం వస్తది. పేదోళ్లపై చర్యలు తీసుకుంటే ఏముంటుంది.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బుధవారం ‘విజయక్రాంతి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది..
వంగూరి గోపాలరావు
హైడ్రా పరిధి ఎంత వరకు?
ప్రభుత్వం జూలై 19న విడుదల చేసిన జీవో నంబర్ 99 ప్రకారం హైడ్రా పరిధి ఓఆర్‌ఆర్ వరకు మాత్రమే. 111 జీవో కూడా మా పరిధిలోకి రాదు. కానీ, స్థానిక సంస్థలు కోరితే కచ్చితంగా సహకరిస్తాం. ఆ సమయంలో మాత్రమే మేం సహకరిస్తున్నాం. అక్కడి సంస్థలు మమ్మల్ని ముందుపెట్టి కూల్చివేతలు చేపడుతున్నాయి. అంతే తప్ప మాకు ఆ కూల్చివేతలకు ఎలాంటి సంబంధం లేదు. మేం ప్రభుత్వ పాలసీ ప్రకారమే విధులు నిర్వహిస్తాం. ఒకవేళ ఓఆర్‌ఆర్ పరిధి దాటి కూడా ప్రభుత్వం మమ్మల్ని పనిచేయమంటే మేం సిద్ధంగా ఉన్నాం. నార్సింగి, మేడ్చల్ మున్సిపాలిటీలు కూడా హైడ్రా పరిధిలోకే వస్తాయి.
హైడ్రా ముందున్న టార్గెట్ ఏంటి?
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేయడమే మా లక్ష్యం. టార్గెట్ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేసిన కమర్షియల్ భవనాలు, రిసార్ట్స్, ఫామ్‌హౌస్‌లే. మానవతా దృక్పథంతో పేద, మధ్య తరగతి ప్రజల జోలికి పోవడం లేదు. ఆక్రమణలకు పాల్పడింది రాజకీయ నాయకులా.. సినీ హీరోలా ప్రభుత్వంలో ఉన్నోళ్లా.. ప్రతిపక్షాల్లో ఉన్నోళ్లా అనే విషయాలతో మాకు సంబంధం లేదు. చెరువుల, ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయా, లేదా అనేదే మేం చూస్తాం. మల్లారెడ్డా.. ఓవైసీనా.. పల్లా రాజేశ్వర్ రెడ్డా అనే ప్రస్తావన మాకు అవసరం లేదు.
ఫిర్యాదు రాగానే ముందుగా విచారణ చేస్తాం. ఆ ఫిర్యాదులో వాస్తవాలు ఉంటే కచ్చితంగా కూల్చివేతలు ఉంటాయి. అంతే తప్ప.. హైడ్రాకు ఎలాంటి రాజకీయ అంశాలతో సంబంధం లేదు. ప్రస్తుతం కొత్తగా జరిగే ఆక్రమణలను కచ్చితంగా అడ్డుకుంటాం. భవిష్యత్‌లో జరగకుంటా చూస్తాం. గతంలో జరిగిన ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, ఆ ఫిర్యాదులో వాస్తవాలుంటే చర్యలు తీసకుంటాం. గతంలో లాగా చెరువులకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. దీంతో నగరంలో ప్రజలు క్వాలిటీ లైఫ్ గడపడానికి అవకాశం ఉంటుంది.
హైడ్రా అంటే రాజకీయ నాయకులు హడలెత్తుతున్నారు.. ప్రతిపక్షాలకు చెందిన వారినే టార్గెట్ చేస్తున్నారా?
అసలు కబ్జాలకు పాల్పడుతున్నదే రాజకీయ పార్టీల నాయకులు కదా.. అయితే, భూ ఆక్రమణలకు పాల్పడిన రాజకీయ నాయకులకే హైడ్రాతో భయం. అందరూ కాదు. అక్రమ నిర్మాణాలకు సహకరించిన అధికారులపైనా కూడా చర్యలు ఉంటాయి. ఇప్పటికే కొందరు అధికారులపై చర్యల కోసం సైబరాబాద్ కమిషనర్‌కు లేఖ రాశాం. ఇప్పటి వరకూ చేపట్టిన కూల్చివేతలలో అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్న నాయకులతో పాటు ఇతర పార్టీలకు చెందిన వారివి కూడా ఉన్నాయి.
రాజకీయాల పార్టీలతో సంబంధం లేకుండా ఆక్రమణదారులు ఎవరైనా చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వం మాకు ఫ్రీడమ్ ఇచ్చింది. అలాంటప్పుడు మేమెందుకు పక్షపాతంగా వ్యవహరిస్తాం. భయాలు వేరు. వాస్తవాలు వేరు. భయాలకు నేను రెస్పాండ్ అవ్వడం సరైంది కాదు. చర్యలు తీసుకుంటున్న క్రమంలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
భవిష్యత్‌లోనూ ఇలాగే చర్యలు కొనసాగుతాయా..
ఈ నెల రోజుల్లో 18 చోట్ల సుమారు 200 అక్రమ నిర్మాణాలను కూల్చివేశాం. హైడ్రా వచ్చినప్పుడు కేవలం భయపెట్టడానికి మాత్రమే అని అన్నవాళ్లున్నారు. ఈ నెల రోజుల్లో ఏం జరిగిందో చూశారు కదా. మరో రెండు, మూడు నెలల్లో చూడండి ఇంకేం జరుగుతుందో. ప్రభుత్వం మంచి లక్ష్యంతో హైడ్రాను ఏర్పాటు చేసింది. ఆక్రమణదారులు ఎంతటి వారైనా కచ్చితంగా చర్యలుంటాయి.
చెరువులు, నాలాల కబ్జాలను ఆపకపోతే మరో 20 ఏళ్ల నాటికి గండిపేట లాగా హుస్సేన్‌సాగర్ కూడా మారుతుంది. ముఖ్యంగా చెరువులను ఇష్టానుసారంగా ఆక్రమణలు చేయడాన్ని మాత్రం అడ్డుకుంటాం. పొలిటికల్, బ్యూరోక్రాట్స్, రియల్ ఎస్టేట్ వాళ్ల మధ్య జరుగుతున్న అపవిత్ర బంధాన్ని ఆపాలి. ఈ అపవిత్ర బంధాన్ని ఆపడానికి హైడ్రా చర్యలు చేపడుతుంది. ఇప్పటికే కొన్ని చెరువులపై రెండు, మూడు దఫాలుగా పరిశీలన చేశాం. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో పరిశీలన చేస్తున్నాం.
ఆక్రమణలకు గురైనవి ఎన్ని చెరువులు, ఎన్ని అక్రమ నిర్మాణాలను గుర్తించారు..
జీహెచ్‌ఎంసీ పరిధిలో 185 చెరువులు ఉన్నాయి. ఓఆర్‌ఆర్ పరిధిలో 600లకు పైగానే ఉన్నాయి. స్పష్టంగా తెలీదు. చెరువులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సంస్థ నుంచి తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం ఎక్కడైతే వాటర్ లాగింగ్ జరుగుతుందో అక్కడి చెరువులపై చర్యలు చేపడుతున్నాం.
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉన్నవి ప్రభుత్వ సంస్థలు. ఈ సంస్థలు పబ్లిక్ యుటిలిటీ కోసం ఏర్పాటు చేసినవి. కానీ, ఇప్పుడు మనం చర్యలు చేపడుతున్నవి వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమణలు చేపట్టినవి కదా. అంతేకాకుండా, ఈ నిర్మాణాలు ఎన్నేళ్ల క్రితం వచ్చాయి అనేది కూడా చూడాలి. హైడ్రా తర్వాత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఎలాంటి అక్రమ నిర్మాణాలు జరగకుండా చూస్తాం.
ఎన్ విషయంలో కానీ, ఇంకేదైన కూల్చివేతల సందర్భాల్లో ఏమైనా ఒత్తిళ్లు వచ్చాయా..
ఇప్పటివరకూ నాకు ఎలాంటి ఒత్తిళ్లు రాలేదు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే.. మేం ఎక్కడ ప్రాపర్టీపై కూల్చివేతలు చేయబోతున్నాం అనే విషయం మాకు తప్ప.. మరెవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు నాకు ఒత్తిళ్లు వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ వచ్చినా, చెప్పినా.. చూడండి అని చెబుతారే కానీ, చర్యలు తీసుకోవద్దని చెప్పరు. ముందుగా బలవంతులను కొడితేనే మిగతా ప్రజలకు నమ్మకం వస్తది. పేదోళ్లపై చర్యలు తీసుకుంటే ఏముంటుంది. హీరో నాగార్జున సినిమాలు నేను కూడా చూస్తాను. సినిమా వేరు. ఉద్యోగం వేరు కదా. ఎన్ ఎలాంటి అనుమతులు లేవు. స్థానిక మున్సిపల్ అధికారులు గతంలో నోటీసులు ఇచ్చారు. అందుకే కూల్చివేశాం.
నోటీసులు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్నాయి..
చెరువులు, నాలాలు ఆక్రమణలకు పాల్పడి నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని జీహెచ్‌ఎంసీ యాక్ట్ 405 ప్రకారం చెబుతుంది. అంతేకాకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే చెరువులు, నాలాలు కబ్జాలకు పాల్పడి చేసిన నిర్మాణాలను కూల్చడానికి ముందస్తుగా ఎలాంటి నోటీసులు అవసరం లేదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజిస్టార్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం) నోటీసులు ఇచ్చేది.
ఈవీడీఎం ఆధ్వర్యంలో గతంలో ఇచ్చిన నోటీసులు కొన్ని వేల సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం హైడ్రా జీవో ద్వారా నడుస్తున్నందున నోటీసులు ఇవ్వడం లేదు. నోటీసులు ఇచ్చేది స్థానిక జీహెచ్‌ఎంసీ అధికారులు మాత్రమే. ప్రస్తుతం హైడ్రా జీవో 99 ప్రకారం మాత్రమే పనిచేస్తున్నది. మేం నోటీసులు జారీ చేస్తే న్యాయపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను కూడా అధిగమించడానికే రెండు లేదా మూడు వారాల్లో ప్రభుత్వం హైడ్రా కోసం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. హైడ్రా చట్టం వచ్చాక నోటీసులు జారీ చేస్తాం. హైడ్రాకు ఫిర్యాదులు చేసే వారికోసం రెండు మూడు రోజుల్లో ఒక వాట్సాప్ నంబర్‌ని కూడా ప్రకటించనున్నాం.






