3 August, 2026 | 9:47 AM

వివాహిత అదృశ్యం

03-08-2026 08:38 AM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సుర్థ్యా తండాకు చెందిన పూజ అలియాస్ నిర్మల (20) అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై ఆమె భర్త రాథోడ్ అనిల్ (22) ఫిర్యాదు మేరకు సిర్గాపూర్ పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆగస్టు 1న మధ్యాహ్నం వ్యవసాయ పనుల నిమిత్తం ఇంటి నుంచి వెళ్లిన అనిల్ సాయంత్రం తిరిగి వచ్చేసరికి భార్య ఇంట్లో కనిపించలేదు. అనంతరం బంధువులు, పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.

అదృశ్యమైన పూజ అలియాస్ నిర్మల సుమారు 5 అడుగుల 4 అంగుళాల ఎత్తు, చామనచాయ రంగు కలిగి ఉండగా, ఇంటి నుంచి వెళ్లే సమయంలో పసుపు రంగు చుడీదార్, ఎరుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్‌ఐ మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూజ అలియాస్ నిర్మల ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్ లేదా సిర్గాపూర్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ మహేష్ కోరారు.