16 July, 2026 | 10:29 PM

అమెరికాలో మాస్ దోపిడీ

17-06-2024 01:12 AM
  • భారతీయ నగల షాపు లూటీ

కాలిఫోర్నియా, జూన్ 16: అమెరికాలో ఓ భారతీయ ఆభరణాల షాపులో భారీ దోపిడీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలో ఉన్న పీఎన్‌బీ జ్యుయెల్లరీ షాపులోకి ఈ నెల 12న అర్థరాత్రి ఏకంగా 20 మంది ముసుగులు ధరించిన దొంగలు ప్రవేశించారు. ఆభరణాలు అమర్చి ఉన్న అద్దాల అరలను పగులగొట్టి అందుల్లో ఉన్న ఒక్క ఆభరణాన్ని కూడా వదలకుండా దోచుకెళ్లిపోయారు. ఈ దోపిడీ దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. షాపులోకి ప్రవేశించిన దొంగలు.. ఎంతో క్రమశిక్షణతో ఒక్కొక్కరు ఒక్కో డెస్క్ వద్దకు వెళ్లి వెంట తెచ్చుకొన్న పరికరాలతో అద్దాలను పగులగొట్టి అందులోని ఆభరణాలను తమ బ్యాగుల్లో సర్దుకొని దర్జాగా వెళ్లిపోయారు.

ఈ దోపిడీ మొత్తం మూడు నిమిషాల్లోనే పూర్తిచేయటం విశేషం. దోపిడీకి పాల్పడినట్టు అనుమానిస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా పనిచేసే పీఎన్‌బీ జ్యుయెల్లర్‌కు భారత్, అమెరికా, దుబాయ్ తదితర ప్రాంతాల్లో 35 షాపులున్నాయి. ఈ సంస్థను పురుషోత్తం నారాయణ్ గాడ్గిల్ స్థాపించారు. పుణెలో ఒక్క షాపుతో మొదలైన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అయితే, ఈ దోపిడీలో ఎంత విలువైన సొత్తు అపహరణకు గురైందన్న విషయాన్ని ఆ సంస్థగానీ, పోలీసులు గానీ తెలుపలేదు.