17 April, 2026 | 9:44 AM

మమ్ములను క్రమబద్ధీకరించండి

01-03-2026 12:00 AM

లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం

ఇందిరాపార్కు వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భారీధర్నా

వినూత్న పద్ధతుల్లో అర్ధనగ్న ప్రదర్శన, బిక్షాటన, బోర్లా పడుకొని మౌనంగా నిరసన

ముషీరాబాద్, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోలను తక్షణమే క్రమబద్ధీకరించాలని తెలం గాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి దోయిపడి శ్రీధర్, దుర్గం శ్రీనివాస్ డిమాం డ్ చేశారు.

శనివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విద్యాసంస్థలు, వైద్య ఆరోగ్య సంస్థల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు భారీ ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మొదట మౌన ప్రదర్శన, తరువాత అర్ధనగ్న ప్రదర్శన, బిక్షాటన, బొర్లాప డుకొని వినూత్న పద్ధతుల్లో ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు.

అనంతరం జేఏసీ చైర్మన్ పులి లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రస్తుతం అమలులో ఉన్న ఏజెన్సీ వ్యవస్థను సమీక్షించి రద్దు చేసి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగు లకు వేతనాలను నేరుగా ప్రభుత్వ ఖజానా ద్వారా చెల్లించే విధానాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే సేవలు అందిస్తున్న ఏ ఉద్యోగిని కూడా తొలగించబోమని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీచేయాలని, పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు.

ఈపీఎఫ్, ఈఎస్‌ఐ మెడికల్ సదుపాయాలు, చెల్లింపు సెలవులు తదితర చట్ట ప్రయోజనాలను కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. వేతన చెల్లింపుల ప్రక్రియలో పారదర్శకతను నిర్ధారించాలని అన్నారు. 2021 సంవత్సరం నుంచి ఎటువంటి వేతన పెంపు జరగకపోవడం బాధాకరమన్నారు. బిశ్వాల్ కమిటీ సూచనల మేరకు ప్రతి సంవత్సరం కనీసం రూ. వెయ్యి వార్షిక వేతన వృద్ధి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

సర్వీసులో ఉండి మరణించిన లేదా పదవీ విరమణ చేసినా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.10 లక్షలు ఆర్థిక సహాయాన్ని అందించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు చట్టబద్ధంగా వేతనంతో కూడి న ప్రసూతి సెలవులు మంజూరు చేయాలన్నారు. సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటకీ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యా ప్తంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

ఈ ధర్నాకు మద్దతు తెలిపిన తెలంగాణ క్రాంతిధళ్ అధ్యకుడు పృథ్వీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 6 వేలకు పైగా ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. ప్రభు త్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకుంటే వారు చేసే ప్రతి ఉద్యమానికి తమ సంపూర్ణమద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు సంతోష్, బాలకృష్ణరెడ్డి, మహ్మద్ రాజహ్మద్, క్రాంతి కుమార్, గడ్డం జయదీష్ జ్యోతి, పద్య, పులి రాజేష్ నజీర్, శేఖర్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.