గచ్చిబౌలిలో భారీ అగ్ని ప్రమాదం
15 బైకులు దగ్ధం
ఫైర్ సేఫ్టీపై స్థానికుల ఆందోళన
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీలో ఉన్న ఒక అపార్ట్మెంట్ సెల్లార్లో సోమవారం ఉదయం షార్ట్ సర్క్యూట్‌తో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 8 గంటల ప్రాంతంలో సెల్లార్లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే పక్కనే పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలకు అంటుకోవడంతో 15 బైకులు పూర్తిగా కాలిపోయాయి.
ప్రమాదం కారణంగా సెల్లార్ నుంచి వెలువడిన దట్టమైన నల్లటి పొగ అపార్ట్మెంట్లోని అన్ని అంతస్తులను కమ్మేసింది. దీంతో నివాసితులు, ము ఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఊపిరాడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు నివాసితులు భయంతో బాల్కనీల్లోకి, టెర్రస్పుకి పరుగులు తీశారు. సమా చారం అందుకున్న వెంటనే గచ్చిబౌలి పోలీసులు, మాదాపూర్ అగ్నిమాపక కేంద్రం నుంచి రెండు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
అగ్నిమాపక సిబ్బంది సుమా రు 45 నిమిషాల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. అదే సమయంలో పోలీసులు అపార్ట్మెంట్లోని మొత్తం 28 ఫ్లాట్ల నివాసితులను సురక్షితంగా బయటకు తరలించారు. సకాలంలో స్పందిం చడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు.ఈ ఘటన తో టీఎన్జీవో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల అపార్ట్మెంట్ల నివాసితులు తీవ్ర భయాం దోళనకు గురవుతున్నారు.
సెల్లార్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పని చేయడం లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ మా ర్గం కూడా వస్తువులతో మూసుకుపోయి ఉంది. ఇవాళ బైకులు కాలాయి, రేపు మనుషులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానిక మహిళా నివాసి ఆవేదన వ్యక్తం చేసింది. చాలా అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరగడం లేదని, పాత వైరింగ్ను మార్చడం లేదని పలువురు ఆరోపించారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






