30 June, 2026 | 6:15 PM

నూతన తరగతి గదులు ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే

30-06-2026 05:09 PM

పాఠశాల నూతన భవనాల నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యేకు మెమొంటోను అందజేసిన సర్పంచ్  

స్కూల్‌కు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.1 లక్ష విరాళం

సిరిసిల్ల,(విజయక్రాంతి): ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ లో పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదులను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. పూర్వ విద్యార్థి ప్రస్తుత చొప్పదండి ఎమ్మెల్యే చొరవతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి అధికారులతో సంభాషించి తను చదువుకున్న బడి మీద మమకారాన్ని చూపారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతున్నావ్ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు.

మొక్కలు నాటడం, పరిశుభ్రత పాటించడం, నీటి వృథాను అరికట్టడం వంటి సామాజిక బాధ్యతలను కూడా విద్యార్థులు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. బొప్పాపూర్ పాఠశాల అభివృద్ధికి రూ.1 లక్ష విరాళం ప్రకటించడంతో పాటు, పూర్వ విద్యార్థిగా పాఠశాల అభివృద్ధి అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చి అనంతరం విద్యార్థులతో మిత్రులతో కలిసి భోజనం చేసి ముచ్చటించారు, తన తోటి పూర్వ విద్యార్థులతో కలిసి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇల్లెందుల గీతాంజలి,శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ కొండాపురం వెంకట్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.