17 April, 2026 | 2:09 AM

మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం

17-04-2026 12:09 AM
  1. ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్ట్

రూ.150 కోట్ల వరకు వసూలు చేసినట్లు అభియోగాలు

రంగారెడ్డి, ఏప్రిల్ 16(విజయక్రాంతి): సామాన్య ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని, మైక్రో ఫైనాన్స్, గోకులా నందా ఇన్ఫ్రాలో పెట్టుబడులా పేరుతో వందల కోట్లకు టోకరా వేసిన భారీ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం, పీఏపల్లి మండలానికి చెందిన మధునాయక్ మైక్రో ఫైనాన్స్ వ్యాపారం ముసుగులో దాదాపు రూ. 150 కోట్ల వరకు వసూలు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.కాగా తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని,సీమెంట్ ఫ్యాక్టరీ, పబ్ ల పేరుతో పెట్టుబడులపై భారీ లాభాలు అందిస్తామని నమ్మించి మధు అండ్ టీమ్ రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది నుంచి డబ్బులు వసూలు చేసింది.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి.ఇప్పటికే మధుపై సైబరాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదయ్యాయి.ఈ కుంభకోణం బయటపడగానే బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో మధు పరారయ్యాడు. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు అతడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ వ్యవహారంలో పాపులర్ సింగర్ మంగ్లీ మరియు ఆమె సోదరుడికి కూడా సంబంధం ఉందంటూ అడ్వకేట్ సుబ్బారావు తదితరులు ఆరోపణలు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ప్రస్తుతం మధును రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది.