calender_icon.png 19 November, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా జల విద్యుత్!

19-11-2025 01:07:16 AM

6,100 మిలియన్ యూనిట్లకుపైగా ఉత్పత్తి

7 వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తి దిశగా పరుగులు

  1.   2022-23 నాటి ఆల్ టైమ్ రికార్డు బ్రేక్
  2. పాత రికార్డులు బద్ధలు కొట్టిన జెన్కో 
  3. భారీ వర్షాలు, వరదలతో అందివచ్చిన అవకాశం
  4. సర్కారుకు సుమారు రూ.4 వేల కోట్ల లాభం

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : ఈ సారి రాష్ర్టంలో కురిసిన భారీ వర్షాలు, నదులకు వచ్చిన వరదలు.. విద్యుత్ శాఖకు మాత్రం సంతోషాన్ని కలిగిస్తోంది. దాదాపు జూన్‌లో కృష్ణా నదికి మొదలైన వరదలతో జల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టిన తెలంగాణ జెన్కో అప్రతిహతంగా.. గడిచిన ఆరు నెలలుగా పూర్తి స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వస్తోంది. దీంతో గతంలోని రికార్డులన్నీ బద్దలు కొడుతోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో 6100 మిలియన్ యూనిట్ల జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసిన జెన్కో 7వేల మిలియన్ యూనిట్ల దిశగా పరుగులు పెడుతోంది. 

2,442 మెగావాట్ల సామర్థ్యం

రాష్ర్టంలో ఎక్కువగా కృష్ణా నదిపైనే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా.. శ్రీశైలంలో 900 మెగావాట్ల, నాగార్జునసాగర్ లో 815.6 మెగావాట్లు, జూరాలలో 234 మెగావాట్లు, లోయర్ జూరాలలో 240 మెగావాట్లు, పులిచింతలలో 120 మెగావాట్లు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్‌పై 60 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఉండగా.. గోదావరి నదిపై పోచంపాడ్, నిజాంసాగర్, సింగూర్ తదితర చోట్ల సుమారు 72 మెగావాట్లకు పైగా సామర్థ్యంతో యూనిట్లు ఉన్నాయి. వెరసి మొత్తం జలవిద్యుత్ సామర్థ్యం.. 2,441.8 మెగావాట్లు. 

గత రికార్డు బద్దలు 

ఇప్పటి వరకు జల విద్యుత్ ఉత్పత్తిలో 2022--23 సంవత్సరానిదే రికార్డు. ఆ సంవత్సరంలో కృష్ణా నదికి భారీగా వరద రావడంతో 6,058 మిలియన్ యూనిట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. అప్పటి వరకు ఆ స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో.. అది రికార్డ్‌గా నిలిచిపోయింది. ఇప్పటి వరకు దానిని దాటే స్థాయిలో జల విద్యుత్ ఉత్పత్తి కాలేదు. కానీ ఈ సంవత్సరం ఆ అవకాశం వచ్చింది. 2022--23 లో రికార్డ్‌ను బద్దలు కొట్టి అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సుమారు 6100 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని దాటడంతో ఇప్పటి వరకు ఉన్న 6,058 మిలియన్ యూనిట్ల రికార్డ్‌ను బద్దలు కొట్టినట్టైంది.

ఏప్రిల్ నుంచి..  

ఈ ఏడాది ఏప్రిల్ నుంచే జల విద్యుత్ ఉత్పత్తిని మొదలు పెట్టిన తెలంగాణ జెన్కో.. ఈ రోజుకు కూడా పూర్తి స్థాయిలో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ తెలంగాణ సర్కారుకు అండగా ఉంటోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అన్ని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా.. మొత్తం 56.53 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా.. వర్షాకాలం ప్రారంభం... నదులకు వరద భారీగా రావడంతో మెల్లమెల్లగా పెరుగుతూ అక్టోబర్‌లో 1435.98 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. నవంబర్‌లో ఇప్పటి వరకు సగటున 45 మిలియన్ యూనిట్ల చొప్పున ఈ నెల 15 తారీకు వరకు చూసుకుంటే ఈ ఏడాది మొత్తం 6100 మిలియన్ యూనిట్ల మార్క్‌ను దాటింది.  

సర్కారుకు జల విద్యుత్ అండ..

రాష్ర్టంలో 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా నేపథ్యంలో చాలా కాలంగా బహిరంగ మార్కెట్‌లో కావలసిన విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోంది. మన దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్ పోనూ.. డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి లోటును పూడ్చుకోవడానికి బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కొన్నిసార్లు యూనిట్‌కు 20 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సగటున కనీసం 6.50 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నారు.

ఐతే ఈ సంవత్సరం గరిష్టంగా జల విద్యుత్ ఉత్పత్తికి ప్రకృతి వరద రూపంలో సాయం చేయడంతో సర్కారుకు ఆర్థికంగా అండగా నిలిచినట్లయింది. ఇప్పటికే 6100 మిలియన్ యూనిట్లకు పైగా ఉత్పత్తి కావడంతో ఇప్పటికే సుమారు 4000 కోట్ల వరకు ఈ ఏడు రాష్ర్ట సర్కారుకు ఆర్థికంగా ప్రకృతి అండగా ఉందని జెన్కో అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.