calender_icon.png 19 November, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ రిజిస్ట్రేషన్ల బాగోతం

19-11-2025 12:34:53 AM

-పైసలిస్తే ఆస్తులు తారుమారు

-అవినీతికి కేరాఫ్ నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్

-బయటపడ్డ దొంగ రిజిస్ట్రేషన్ల పర్వం

-డాక్యుమెంట్ రైటర్లది కీలక పాత్ర

-స్పందించని అధికార యంత్రాంగం

నల్లగొండ, నవంబర్ 18 (విజయక్రాంతి) : అది నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం.. ప్రతి పనికీ ఓ రేటు.. పైసలిస్తే కాని పనంటూ ఏమీ ఉండదు. ఇక్కడ సక్రమంగా జరగాల్సిన పనులైనా సరే.. ముడుపులు చెల్లించుకోవాల్సిందే.. నల్లగొండ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలు తోంది. అడిగినంత ఇస్తే కానీ ఇళ్లు, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ కావడం లేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల ద్వారా ముడుపులను పుచ్చుకుంటున్నారు.

అన్నీ సక్రమంగా ఉన్నా.. ఏదో ఒక తిరకాసు పెడుతూ జిల్లాల్లోనైతే రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు, కొన్ని పెద్ద రిజిస్ట్రేషన్లపై ఏకంగా రూ.లక్షపైనే దండుకుంటుండడం కొసమెరుపు. రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు ఎస్‌ఆర్వో, సిబ్బంది వాటా ముట్టజెప్పితేనే రిజిస్ట్రేషన్ పని పూర్తవుతోంది.ప్రధానంగా అక్రమ రిజిస్ట్రేషన్ల పర్వం నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగుచూసింది. అయితే ఈ వ్యవహారంపై అధికారులు దాటవేత ధోరణిని అవలంభిస్తుండడం కొసమెరుపు. 

అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం..

నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ మున్సిపాలిటీలో కీలకంగా వ్యవహారించే ఓ కాంట్రా క్టర్ రూ.లక్షలు విలువ చేసే ఆస్థిని తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. ఇందుకోసం అధికారులకు పెద్దఎత్తున డబ్బులు ముట్టజెప్పారు. నిజానికి ఒక వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ అయిన ఆస్తిని తాను స్వయంగా రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప వేరే వ్యక్తికి బదిలీ కాదు. కానీ నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముడుపులు ఇస్తే మాత్రం వ్యక్తి లేకున్నా సరే.. గంటల వ్యవధిలోనే ఆస్తిని తారుమారు చేయడంలో ఆరితేరారు. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై అధికారులను అడిగితే.. రోజుకూ వందల రిజిస్ట్రేషన్లు చేస్తాం.. అవన్నీ మాకు గుర్తుంటాయా..? ఏంటి అంటూ ఎదురు ప్రశ్నిస్తుం డడం గమనార్హం.

చేయి తడిపితే అన్నీ సక్రమమే..

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలుస్తున్నాయి. వీటికి ఎటువంటి అనుమతులులేవు. ఇది సబ్రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు కాసులు కురిపిస్తోంది. ప్లాట్కు రూ.10 వేలు ఇస్తే చాలు, అభ్యంతరాలు లేకుండా,నిబంధనలను తుంగలో తొక్కి, ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు సమాచారం. కార్యాలయంలో చేయి తడపందే ఏ పనీ జరగడం లేదు. భూములు, స్థలాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్కు రూ.లక్షకు రూ.2 వేలవంతున రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్లు సమాచారం.

అంతా దళారుల ద్వారానే ఈ వ్యవహారం నడుస్తుండటం గమనార్హం. డాక్యుమెంటు విలువ పెరిగే కొద్దీ మామూళ్లు కూడా పెంచి గుంజుతున్నట్లు తెలుస్తోంది. స్థలాల రిజిస్ట్రేషన్లలో ఒక్కో ప్లాటుకు రూ. 3వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తుండటం గమనార్హం. అనుమతుల్లేని వెంచర్ల ప్లాటుకు అయితే రూ.15వేలకు పైమాటేనట. ఇలా ప్రతి నెలా రూ. లక్షల మాముళ్లు అధికారుల జేబుల్లోకి వెళ్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

డాక్యుమెంట్ రైటర్లదే కీ రోల్..

నల్లగొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హల్చల్ చేస్తు న్నారు. అధికారుల క్యాబిన్లలో కూర్చోంటూ రేట్లు ఫిక్స్ చేస్తుండటం గమనార్హం. కార్యాలయంలో అధికారులకన్నా.. రైటర్ల హడావుడే ఎక్కువగా కనిపిస్తుండటం విశేషం. రిజిస్టేషన్ కార్యాలయం సమీపంలో అనధికారి కంగా ఆఫీసులను ఏర్పాటు చేసుకున్న కొంతమంది రైటర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. కొనుగోలు, అమ్మకందారుల డాక్యుమెంట్లను రెడీ చేయాల్సిన రైటర్లు సబ్‌రిజిస్ట్రార్ సిబ్బందికి అదనపు ఆదాయ వనరుగా మారారు. అక్రమాలు బయట పడకుండా, సిబ్బంది తప్పులు ఎవరికీ కనపడకుండా చూడడంలో వీరిదే కీ రోల్.  ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే.