26 March, 2026 | 2:30 AM

టీఆర్పీలో భారీగా చేరికలు

26-03-2026 12:52 AM

కండువా కప్పి ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని పలు పార్టీలకు చెందిన నాయకులు భారీ ఎత్తున తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ఇంచార్జ్ కొమరిశెట్టి నరసింహులు, ఉష ఆధ్వర్యంలో  ఆ పార్టీలో చేరారు. టీఆర్పీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో టీఆర్పీలో చేరారు.

చేరిన వారిలో శ్రీకాంత్ చారీ (మాజీ కౌన్సిలర్, 5వ వార్డు ఆలేరు), చిట్టిమిల్లు వెంకటేష్ (కాటన్ సొసైటీ మెంబర్), కొండ పరమేశ్వర్ (సిల్క్ సొసైటీ కో-ఆప్షన్ సభ్యులు), ఎండీ ఇస్మాయిల్ (మైనార్టీ సెల్ కో-ఆప్షన్ సభ్యు లు), చెక్క రవి ముదిరాజ్ (బీజేపీ నాయకులు), సంగు రాజు (బీఆర్‌ఎస్ నాయకులు) తదితరులు ఉన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే, బీసీల హక్కుల కోసం నిజాయితీగా పోరాడే ఏకైక రాజకీయ వేదిక టీఆర్పీ అని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఆలేరు నియోజకవర్గంలో అగ్రవర్ణ పార్టీలకు బీసీలు కేవలం ఓటు బ్యాం కుగా కాకుండా, తమ స్వంత రాజకీయ శక్తి గా ఎదగాలని, నిజమైన బీసీ పార్టీ అయిన టీఆర్పీ నుంచే మన బిడ్డలను గెలిపించుకునే దిశగా అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కోశాధికారి కొక్కల కొండ మనోజ్ పాల్గొన్నారు.

చేనేత కార్మికులకు మద్దతు

చేనేత వస్త్ర పరిశ్రమ, చేనేత పవర్‌లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్పందించింది. ఇందిరా పార్క్ వద్ద కార్మికులు నిర్వహించిన ధర్నాలో తీన్మార్ మల్లన్న పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. చేనేత కార్మికులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభు త్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యల పరిష్కారం కో సం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, లేకపోతే ఈ రంగం పూర్తిగా క్షీణించే ప్రమా దం ఉందని హెచ్చరించారు.

మరుగుజ్జులకు మద్దతుగా..

మరుగుజ్జు వర్గాల హక్కుల సాధన కోసం ఇందిరా పార్క్ వద్ద కొనసాగుతున్న నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మద్దతు ప్రకటించారు. నిరసన చేస్తున్న వారికి స్వయంగా శరబత్ అందించి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ.. ఎన్నికల సమయం లో మరుగుజ్జు వర్గాలకు ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేని ప్రభుత్వం ప్రజల ముందు నైతిక హక్కు కోల్పోయిందని విమర్శించారు.

కనీసం మరుగుజ్జుల వంటి అతి చిన్న వర్గాలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చని మీరు ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు? వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా మరుగుజ్జు వర్గాలు రోడ్లపైకి రావాల్సి వస్తోందని, ఇది పాలన వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని అన్నారు. మరుగుజ్జు వర్గాల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.