16 July, 2026 | 11:56 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలి

16-07-2026 11:56 PM

విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న సర్కార్

పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన

ఎల్బీనగర్, జులై 16 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్‌యూ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం దిల్‌సుఖ్‌నగర్‌లోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.

ఈ సందర్భంగా పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.వెంకటరెడ్డి, ఎ.సాంబా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తి కావస్తున్న నేటికీ పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను విడుదల చేయకుండా కాలయాపన చేస్తూ విద్యార్థులను తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్ల పైగా బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని విడుదల చేయకుండా, విద్యాశాఖకు మంత్రిని కేటాయించకుండా నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్‌లను ఏర్పాటు చేసి తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి హామీలు ఇస్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరారు.